Hyderabad, Sep 4: తెలంగాణలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికపై (Huzurabad Bypoll 2021) ఎన్నికల కమిషన్ స్పందించింది. దసరా తర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పండగల సీజను ముగిశాకే ఉప ఎన్నిక నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని వెల్లడించింది. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఉప ఎన్నిక ఉండే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నిక కూడా దసరా తర్వాతే ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉప ఎన్నికను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కూడా కోరినట్లు వెల్లడించింది.
ఎన్నికల నిర్వహణపై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) తీసుకుంది. ఈ నెల 1వ తేదీన 12 రాష్ట్రాల సీఎస్‌లతో సీఈసీ సమావేశమైంది. ఈ నెల 30న బంగాల్‌లోని భవానీపూర్, జంగీపూర్, శంషేర్‌గంజ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ వెల్లడించింది. అదే రోజున ఒడిశాలోని పిప్లి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నట్లు తెలిపింది.
మాజీ మంత్రి ఈటల రాజేందర్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో విభేదాలు ఏర్పడిన తరువాత, జూన్ 12 న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. నోటిఫికేషన్ రాకముందే అక్కడ ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ గులాబి కండువా కప్పుకోవడంతో రాజకీయ వేడి మరింతగా రాజుకుంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హుజురాబాద్ నుంచి దళితబంధు పథకాన్ని ప్రారంభించి అక్కడ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.