Covid Second Wave: పూర్తి లాక్‌డౌన్ లేకుండా కర్ఫ్యూలు విధిస్తున్న రాష్ట్రాలు, దేశంలో తాజాగా 2,73,810 మందికి కరోనా నిర్ధారణ, కరోనాతో మాజీ మంత్రి కన్నుమూత, 4 వేల రైల్వే బోగీలను కొవిడ్‌ కేర్‌ ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చిన రైల్వే శాఖ
Coronavirus Outbreak | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, Apr 19: దేశంలో కొత్త‌గా 2,73,810 మందికి కరోనా నిర్ధారణ (Coronavirus Outbreak) అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 1,44,178 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,50,61,919 కు (India Coronavirus) చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 1,619 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,78,769 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,29,53,821 మంది కోలుకున్నారు. 19,29,329 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 12,38,52,566 మందికి వ్యాక్సిన్లు వేశారు.

బీహార్ మాజీ మంత్రి, జేడీయూ ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరి కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గతవారం కరోనా బారినపడిన ఆయన పాట్నాలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా, తారాపూర్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన మేవాలాల్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు రావడంతో మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. మేవాలాల్ మృతికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి విద్య, రాజకీయ రంగాలకు తీరని లోటని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం నేపథ్యంలో రాష్ట్రాలకు అండగా నిలిచేందుకు దాదాపు 4 వేల రైల్వే బోగీలను రైల్వే శాఖ ప్రత్యేక కొవిడ్‌ కేర్‌ ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చింది. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వాటి ఫొటోలను ట్విట్టర్‌లో పంచుకున్నారు.

దేశంలో ముంచుకొస్తున్న ఆక్సిజన్‌ కరవు, నేటి నుంచి పట్టాలెక్కనున్న ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ సిలిండర్లను రవాణా చేయనున్న రైల్వే శాఖ, పరిశ్రమలకు ఆెక్సిజన్ సరఫరా నిలిపివేయాలని రాష్ట్రాలను కోరిన కేంద్రం

ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం నిండుకుంటే ఆయా రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రైల్వే వర్గాలు ప్రకటించాయి. ఇప్పటికే శకూర్‌ బస్తీ స్టేషన్‌లో 800 పడకల సామర్థ్యం కలిగిన 50 బోగీలు, ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌లో మరో 25 బోగీలు అందుబాటులో ఉన్నాయని గోయల్ తెలిపారు. రాష్ట్రాలు కోరితే దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా పడకల్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్‌ 20 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపింది. నిరంతరం నడవాల్సిన పరిశ్రమలు, పెట్రోల్‌ బంకులు, ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీస్‌లకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చారు. ఇక ప్రతి ఆదివారం పూర్తి లాక్‌డౌన్‌ విధించనున్నట్లు ప్రకటించింది. కూరగాయలు, చేపలు, సినిమా హాళ్లు, షాపింగ్‌ కాంప్లెక్సులు కూడా ఆదివారం మూసి ఉంచాలని తెలిపింది.

భారీగా తగ్గిన రెమ్‌డెసివిర్‌ ధరలు, కొత్త ధరల వివరాలను వెల్లడించిన ఎన్‌పీపీఏ, రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 28 లక్షల నుంచి 41 లక్షలకు పెంచాలని ఫార్మాకంపెనీలను కోరిన కేంద్రం

ఇక 12వ తరగతి వార్షిక పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ప్రాక్టికల్‌ పరీక్షలు మాత్రం యథాతధంగా కొనసాగుతాయని తెలిపింది. ఆదివారం రెస్టారెంట్లు, హోటళ్లు ఉదయం 6 గం. నుంచి 10 గంటలు, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటలు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని తెలిపింది. విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది.

ఊటీ, కొడైకెనాల్‌, యారాకుడ్‌ వంటి పర్యాటక ప్రదేశాలతో పాటు మ్యూజియాలు, పార్కులు, జూలు ఇతర పురాతత్వశాఖ ఆధ్వర్యంలో ఉండే ప్రదర్శనశాలలన్నీ మూసి ఉంటాయి. పెళ్లిళ్లకు 100 మంది, అంత్యక్రియలకు 50 మందిని అనుమతించనున్నారు.

కరోనా కట్టడి కోసం బీహార్ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు ఉపక్రమించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు గంట ముందే మూసివేయాలని ఆదేశించింది. విద్యాసంస్థలు, మతపరమైన సంస్థలు మే 15 వరకు పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా పలు కఠిన ఆంక్షలతో పరోక్షంగా పాక్షిక లాక్‌డౌన్‌ను ప్రకటించింది.

నితీశ్ కుమార్‌ ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకున్న కీలక నిర్ణయాలు

* రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ

* మే 15 వరకు విద్యాంస్థలు బంద్‌

* సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాళ్లు, క్లబ్బులు, పార్కులు మూత

* ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు సాయంత్రం 5 గంటల తర్వాత మూత

* వైద్యారోగ్య సిబ్బంది సేవలకు గుర్తింపుగా నెల వేతనం బోనస్‌

* కేసులు అధికంగా ఉన్న చోట కంటైన్‌మెంట్‌ జోన్ల ఏర్పాటు

* హోంఐసోలేషన్‌లో ఉండే స్తోమత లేనివారి కోసం అన్ని జిల్లాలు, నగరాలు, పట్టణాల్లో క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు

* వంట సరకులు, మాంసం, ఔషధాలు లభించే దుకాణాలు సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయి.

* రెస్టారెంట్లు, హోటళ్లు కేవలం హోం డెలివరీ సేవలు మాత్రమే అందించాలి

* వివాహాలు, అంత్యక్రియలు మినహా మిగిలిన ఎటువంటి సమావేశాలకు అనుమతి లేదు.

* అన్ని మతపరమైన సంస్థలు బంద్‌

* ప్రజలు గుమికూడే అవకాశం ఉన్న ప్రదేశాల్లో జిల్లా యంత్రాంగాలు 144 సెక్షన్‌ అమలయ్యేలా చూడాలి

* అంబులెన్స్‌, ఫైర్‌, ఈ-కామర్స్‌ వంటి అత్యవసర సేవలకు ఆంక్షల నుంచి మినహాయింపు

* ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వెళ్లిన బీహార్ ప్రజలు తిరిగి వీలైనంత త్వరగా సొంత రాష్ట్రానికి రావాలని నితీశ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు.