New Delhi, Jan 27: దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను (Covid Updates in India) కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 12,689 మందికి (India Coronavirus) కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 13,320 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,89,527కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 137 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,53,724కు (Covid Deaths) పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,03,59,305 మంది కోలుకున్నారు
కరోనా వైరస్ కట్టడికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ( Covid Vaccination) కార్యక్రమం మొదలైంది. ఈ నేపథ్యంలో నిపుణులు కీలక సూచన చేశారు. అందుబాటులో ఉన్న టీకాలను సత్వరమే వినియోగించాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్ ఎక్స్‌పైరీ గడువు 6 నెలలు మాత్రమే ఉంటుందని, కాబట్టి వీలైనంత త్వరగా అందరికీ టీకాలు వేయాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న టీకాల వినియోగానికి గడువు అవి తయారైనప్పటి నుంచి ఆరు నెలలు మాత్రమేనని చెబుతున్నారు.
కాగా మన దేశంలో ప్రస్తుతం రెండు కంపెనీల టీకాలను తొలి దశలో ఇస్తున్నారు. ఇందులో ఓ కంపెనీ ఇప్పటికే 2 కోట్ల డోసులను ప్రభుత్వానికి అందించింది. మరో 60 లక్షల డోసులు కంపెనీ వద్ద ఉన్నాయి. మరో సంస్థ వద్ద కూడా 2 కోట్ల డోసులు నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 16న దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 20 లక్షల మందికి మాత్రమే టీకాలు వేశారు.అందుబాటులో ఉన్న టీకాలను ఆరు నెలల లోపు వినియోగించుకోలేకపోతే అవన్నీ ఎందుకూ పనికిరాకుండా పోతాయి. ఈ నేపథ్యంలో టీకా వినియోగ గడువును తయారీ తేదీ నుంచి గరిష్టంగా ఏడాదిపాటు ఉండేలా చూడాలని కంపెనీలు యోచిస్తున్నాయి. ఇందుకోసం పరిశోధనలు ప్రారంభించాయి.
బ్రిటన్ ప్రయాణికులకు కరోనావైరస్ : ఇదిలా ఉంటే బ్రిటన్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుల్లో చాలామందికి కరోనా పాజిటివ్‌గా (Coronavirus Positive) తేలుతుండడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు ఇప్పటి వరకు 5 విమానాలు రాగా, అందులో వచ్చిన వారిలో 15 మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో వారు కూర్చున్న సీట్లకు ముందు, వెనక మూడు వరుసల్లోని ప్రయాణికులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. నిజానికి బ్రిటన్‌లో విమానం ఎక్కడానికి 72 గంటల ముందు కరోనా టెస్టు చేయించుకుని ఉండాలి.
ఆర్టీపీసీఆర్ టెస్టులో నెగటివ్ వచ్చిన ప్రయాణికులను మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. అయినప్పటికీ హైదరాబాద్ వచ్చాక కొందరు పాజిటివ్‌గా తేలుతుండడం అధికారులను కలవరపరుస్తోంది. బ్రిటన్‌లో చేయించుకున్న పరీక్షల్లో నెగటివ్ వచ్చిన వారికి సైతం ఇక్కడ నిర్వహించే పరీక్షల్లో పాజిటివ్ వస్తుండడంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటి వరకు ఇలా 15 మంది పాజిటివ్‌గా తేలగా, వారందరినీ గచ్చిబౌలి లోని టిమ్స్‌కు తరలించారు. వారితో కలిసి ప్రయాణించిన మరో 300 మందిని క్వారంటైన్‌కు పంపించారు
తెలంగాణలో కరోనా కేసులు : తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 147 కరోనా కేసులు (TS Covid Update) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 399 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,737కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,89,325 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1593కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 2,819 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,295 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 32 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా కేసులు: గత 24 గంటల్లో 38,323 కరోనా పరీక్షలు నిర్వహించగా, 172 మందికి పాజిటివ్ (AP Covid Update) అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 39 కొత్త కేసులు వెల్లడయ్యాయి. విశాఖ జిల్లాలో 34, గుంటూరు జిల్లాలో 22, తూర్పు గోదావరి జిల్లాలో 21 కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కర్నూలు జిల్లాలో 1, నెల్లూరు జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 4 కేసులు వచ్చాయి. అదే సమయంలో 203 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, కడప జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,87,238 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,78,731 మంది వైరస్ ప్రభావం నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,357 మంది చికిత్స పొందారు. కరోనా మృతుల సంఖ్య 7,150కి పెరిగింది