Covid Updates: భారీగా పెరుగుతున్న కేసులు, మార్చి 31 వరకు కోవిడ్ నిబంధనలు పొడిగింపు, కొవాగ్జిన్ కోసం భారత్‌తో బ్రెజిల్ ఒప్పందం, దేశంలో తాజాగా 16,488 మందికి కోవిడ్, తెలంగాణాలో కొత్తగా 178 కరోనా కేసులు, ఏపీలో 96 మందికి కరోనా
Coronavirus Lockdown. Representative Image (Photo Credit: PTI)

New Delhi, Feb 27: దేశంలో గత 24 గంటల్లో 16,488 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 12,771 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,79,979కు (Coronavirus in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 113 మంది కరోనా కారణంగా మృతి (Covid deaths) చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,938కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,63,451 మంది కోలుకున్నారు.

1,59,590 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,42,42,547 మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 21,54,35,383 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,73,918 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తెలంగాణలో కొత్త‌గా 178 కరోనా కేసులు (TS Coronavirus) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 148 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,631కి చేరింది.

ఇప్పటివరకు మొత్తం 2,95,059 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,633 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,939 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 850 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 30 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

వ్యాక్సిన్ ధరపై 2 రోజుల్లో స్పష్టత ఇస్తాం, మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్‌, దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేటు వ్యాక్సినేషన్‌ కేంద్రాల ద్వారా ప్రక్రియ, మీడియాతో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌

ఏపీ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 34,778 కరోనా పరీక్షలు నిర్వహించగా 96 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని వెల్లడైంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 22 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 17, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో 9 చొప్పున , తూర్పు గోదావరి జిల్లాలో 7 కేసులు గుర్తించారు.

ప్రకాశం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 71 మంది కరోనా నుంచి కోలుకోగా, చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 8,89,681 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,81,877 మంది కరోనా ప్రభావం నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ఇంకా 635 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారికి చికిత్స కొనసాగుతోంది. అటు, మొత్తం మరణాల సంఖ్య 7,169కి చేరింది.

కోవిడ్ నిబంధనలను మార్చి 31 వరకు కేంద్ర ప్రభుత్వం (Covid Rules) పొడిగించింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. మహమ్మారి నుంచి పూర్తి స్థాయిలో బయటపడేందుకు పూర్తి నిఘా అవసరమని... ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల అమలును పొడిగిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది.

ముంచుకొస్తున్న కరోనా పెనుముప్పు, తెలంగాణలో కొత్త కరోనా వైరస్, మహారాష్ట్ర, కేరళలో రెండు రకాల వైరస్‌లు, 

నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా వ్యాక్సినేషన్ ను కొనసాగించాలని... అప్పుడే కరోనా చైన్ ను బ్రేక్ చేయగలమని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లను సరిగా గుర్తించాలని కేంద్రం తెలిపింది. ఈ జోన్లలో కరోనా నిబంధనలను పటిష్ఠంగా అమలు చేయాలని చెప్పింది. జనవరి 27న విడుదల చేసిన గైడ్ లైన్స్ ను పాటించాలని తెలిపింది.

అయితే కొత్త నిబంధనల ప్రకారం సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ కొనసాగుతాయి. సామాజిక, మత, సాంఘిక కార్యక్రమాలపై ఆంక్షలు ఉండవు. పాఠశాలలు థియేటర్లు వంటివి 50 శాతం ఆక్యుపెన్సీతో కొనసాగవచ్చు. క్లోజ్డ్ ప్రదేశాల్లో 200 మందికి మించి గుమికూడరాదు. అంతర్రాష్ట్ర ప్రయాణాలు, సరకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ట్రేడ్ ఒప్పందాల ప్రకారం సరిహద్దు దేశాలతో వాణిజ్యం కొనసాగుతుంది. ప్రయాణాలకు ఎలాంటి ఈ-పర్మిషన్లు అవసరం లేదు. కంటైన్మెంట్ జోన్లకు వెలుపల అన్ని కార్యకలాపాలను కొనసాగించవచ్చు. అయితే కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించాల్సి ఉంటుంది.

మానవాళిపై మరో కొత్త వైరస్ దాడి, రష్యాలో జంతువుల నుంచి మానవుల శరీరంలోకి H5N8 వైరస్‌, డిసెంబర్‌లో పక్షుల్లో బయటపడిన వైరస్, అప్రమత్తం అయిన రష్యా

భార‌త్ అభివృద్ధి చేస్తోన్న క‌రోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ను త‌మ దేశ ప్ర‌జ‌ల‌కు అందించ‌డం కోసం బ్రెజిల్ ఒప్పందం కుదుర్చుకుంది. భార‌త ఔష‌ధ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్ నుంచి 20 మిలియన్‌ డోసుల కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ కొనుగోలు చేయ‌డానికి ఆర్డ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. ఈ 20 మిలియన్‌ డోసుల్లో తొలి ఎనిమిది మిలియన్ల డోసులు బ్రెజిల్‌లోని ప్రెసిసా మెడికామెంటోస్‌లోనే ఉత్పత్తి అవుతాయి. వీటిని వ‌చ్చేనెలలో త‌మ దేశ ప్ర‌జ‌ల‌కు వేస్తామ‌ని బ్రెజిల్ ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి.

అనంత‌రం మ‌రో ఎనిమిది మిలియన్ల డోసులు ఏప్రిల్‌లో త‌మ దేశ ప్ర‌జ‌ల‌కు అందుబాట‌లోకి వ‌స్తాయ‌ని చెప్పాయి. మిగిలిన కొవాగ్జిన్ డోసులు మే నెలలో అందుబాటులోకి వస్తాయని వివ‌రించాయి. కాగా, అమెరికా, భార‌త్ త‌ర్వాత బ్రెజిల్లో అత్య‌ధిక మందికి క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. మొత్తం ఆ దేశంలో 1,03,90,461 మందికి కరోనా సోకింది. ప్ర‌పంచంలో అత్య‌ధిక మ‌ర‌ణాలు సంభ‌వించిన దేశాల్లో రెండో స్థానంలో బ్రెజిల్ ఉంది. ఆ దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 2,51,498 మంది ప్రాణాలు కోల్పోయారు.