COVID-19 in India: మళ్లీ లాక్‌డౌన్ పరిష్కారం కాదన్న మహారాష్ట్ర సీఎం, ఢిల్లీలో మూడవదశలో కోవిడ్, దేశంలో తాజాగా 44,059 మందికి కరోనా, భారత్‌లో 91లక్షల మార్క్‌ను దాటిన కరోనా కేసులు
Coronavirus | Representational Image | (Photo Credit: PTI)

New Delhi, November 23: దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 91లక్షల మార్క్‌ను దాటింది. తాజాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 44,059 పాజిటివ్‌ కేసులు (COVID-19 in India) నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమశాఖ తెలిపింది. మరో 511 మంది కరోనాకు బలి కాగా.. ఇప్పటి వరకు 1,33,738 మంది మృత్యువాతపడ్డారు. 24 గంటల్లో 41,024 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

ప్రస్తుతం దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 91,39,866కి చేరగా (COVID-19 in India) 4,43,486 యాక్టివ్‌ కేసులుండగా.. 85,62,642 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా ఆదివారం ఒకే రోజు 8,49,596 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 13,25,82,730 టెస్టులు చేసినట్లు వివరించింది.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం రేపుతోంది. సెకండ్ వేవ్ దిశగా సాగుతోంది. అన్‌లాక్‌లో సడలింపులిస్తున్నామని, కానీ ప్రజలు కరోనా నిబంధనలు పాటించకుండా గుమిగూడటం సమంజసం కాదని ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాకరే పేర్కొన్నారు. కరోనా వ్యాప్తికి మళ్లీ లాక్‌డౌన్‌ విధించడమే పరిష్కారం కాదన్నారు. ఒకవేళ మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తే.. ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఏం చేశారంటే లాక్‌డౌన్‌ విధించానని చెప్పాలా? అని ప్రజలను సీఎం ప్రశ్నించారు.

మళ్లీ ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ, చాలా నగరాల్లో రెండవ దశకు చేరిన కరోనావైరస్, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరిక

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం, చేతులు తరచు కడగడం మూడు సూత్రాలు అత్యంత కీలకమైనవని ముఖ్యమంత్రి సూచించారు. ఆదివారం రాత్రి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని, మన ఆరోగ్యం మనచేతిలో ఉందని ఇప్పటి వరకు అందరి సహకారంతో కరోనాను నియంత్రణలో ఉంచగలిగామని తెలిపారు. కానీ, మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం కొంత ఆందోళనకరమన్నారు.

ముంబై రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులకు చేస్తున్న పరీక్షలలో కేవలం మూడు ప్రాంతాల్లోనే 264 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దాటుతుందోనని విద్యాశాఖ అప్రమత్తమైంది. దీంతో సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయా లేదా మళ్లీ ఈ విషయంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనే విషయంపై కొంత అయోమయం నెలకొంది.

మళ్లీ లాక్‌డౌన్ దిశగా కొన్ని దేశాలు, తరుణ్‌ గొగోయ్‌ ఆరోగ్య పరిస్థితి విషమం, చాలా రాష్ట్రాల్లో కర్ఫ్యూతో కూడిన కొత్త నిబంధనలు

ఢిల్లీలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతోందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మాస్కు ధరించని వారికి జరిమానాను రూ.500 నుంచి ఏకంగా రూ.2,000కు పెంచేశారు. వివాహానికి 200 మంది అతిథులు హాజరుకావొచ్చంటూ గతంలో ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకున్నారు. జన సంచారం అధికంగా ఉండే మార్కెట్లను మూసివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కేంద్ర హోం శాఖ సైతం రంగంలోకి దిగింది. నవంబర్‌ ఆఖరి వరకు ప్రతిరోజూ 60,000 ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆసుపత్రుల్లో పడకల సంఖ్య, వసతులు భారీగా పెంచాలని కోరింది.

పండుగల తర్వాత కరోనా కేసులు పెరు గుతుండటంతో పలు రాష్ట్రాలు ప్రధాన నగరాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నాయి. కఠిన ఆంక్షలు (New Restrictions Imposed in Cities) విధిస్తున్నాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌, సూరత్‌, వడోదర నగరాల్లో శనివారం రాత్రి నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అయితే, కర్ఫ్యూ (Night Curfews) ఎప్పటివరకు అనేది స్పష్టం చేయలేదు. రాజధాని అహ్మదాబాద్‌లో శుక్రవారం రాత్రి నుంచే కర్ఫ్యూ కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌ సహా ఇండోర్‌, గ్వాలియర్‌, విదిశ, రత్లాం జిల్లాల్లోనూ శనివారం రాత్రి నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.