New Delhi, June 14: దేశంలో 72 రోజుల తర్వాత కొత్త కరోనా కేసుల సంఖ్య 71 వేల దిగువకు చేరింది. గత 24 గంటల్లో 70,421 కరోనా కేసులు (COVID-19 in India) నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాని ప్రకారం... నిన్న 1,19,501 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,10,410కు (COVID-19 Cases in India) చేరింది. అయితే మరణాల సంఖ్యలో మాత్రం క్రితం రోజుతో పోల్చితే పెరుగుదల నమోదైంది. 3,921 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,74,305కు పెరిగింది.
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,81,62,947 మంది కోలుకున్నారు. 9,73,158 మందికి (COVID 19 Active Cases) ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. రికవరీ రేటు 95.43 శాతానికి పెరగ్గా..క్రియాశీల రేటు 3.30 శాతానికి తగ్గింది. మరోపక్క నిన్న 14,99,771 మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు ప్రజలకు అందిన టీకాల సంఖ్య 25,48,49,301గా ఉంది. మహారాష్ట్రలో తాజాగా ఉస్మానాబాద్‌లో 4 రోజుల్లో 65 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ వచ్చింది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు మూడు రోజుల్లో 4 లక్షల టీకాలు పంపిణీ చేయనున్నట్లు కేంద్రం ఆదివారం తెలిపింది.
దట్టమైన అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నివసించే వారికి కోవిడ్–19 వ్యాక్సినేషన్ కోసం కేంద్రం సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. డ్రోన్ల సాయంతో టీకా డోసుల్ని పంపించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి బిడ్లను కూడా ఆహ్వానించింది. డ్రోన్ల సాయంతో మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్‌ను పంపించడానికి గల సాధ్యాసాధ్యాలపై ఐఐటీ కాన్పూర్ సహకారంతో కేంద్రం ఇప్పటికే అధ్యయనం నిర్వహించింది. అన్‌మాన్‌డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ.. డ్రోన్లు)తో టీకా డోసులు పంపించడానికి వీలవుతుందని ఆ అధ్యయనంలో తేలింది.
ఈ నేపథ్యంలోనే ఇండియన్ రీసెర్చ్ మెడికల్ ఆర్గనైజేషన్ (ఐసీఎంఆర్) తరఫున హెచ్‌ఎల్‌ఎల్ ఇన్‌ఫ్రా టెక్ సర్వీస్ లిమిటెడ్ డ్రోన్ల సాయంతో టీకా డోసుల్ని పంపించడానికి ఆసక్తి కలిగిన కంపెనీలు జూన్ 22లోగా తమ బిడ్లను దాఖలు చేయాలని ఒక ప్రకటన విడుదల చేసింది. డ్రోన్లకు నాలుగు కేజీల బరువుని మోసే సామర్థ్యం ఉండాలని, 100 మీటర్ల ఎత్తులో 35 కి.మీ. వరకు ప్రయాణించి, తిరిగి వెనక్కి రాగలిగేలా ఉండాలని హెచ్‌ఎల్‌ఎల్ స్పష్టం చేసింది.
మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి వ్యాక్సిన్ ఇవ్వడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సవాల్‌గా మారింది. ఇప్పటివరకు దేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఈ తరహా ఆలోచన చేసింది. ఫ్లిప్‌కార్ట్ సంస్థ సహకారంతో డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలకు టీకా డోసుల్ని పంపించేలా ఆరు రోజుల పైలెట్ ప్రాజెక్టుని కూడా నిర్వహించినట్టు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇప్పుడే కేంద్రమే ముందుకు రావడంతో త్వరలోనే గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా వ్యాక్సిన్ అందనుంది.