వాషింగ్టన్, నవంబర్ 22: భారత్-అమెరికా మధ్య సంబంధాలు బలమైన పునాదిపై నిర్మించబడిందని, భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీపై లంచం ఆరోపణల చుట్టూ కొనసాగుతున్న సంక్షోభాన్ని ఇవి అధిగమించగలవని వైట్ హౌస్ విశ్వాసం వ్యక్తం చేసింది.రోజువారీ వార్తా సమావేశంలో భాగంగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియర్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ అదానీపై అభియోగాల గురించి పరిపాలనకు తెలుసని, దానిని నిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపారు.
సౌర విద్యుత్ కాంట్రాక్టులకు అనుకూలమైన నిబంధనలకు బదులుగా భారతీయ అధికారులకు USD 250 మిలియన్ల (సుమారు రూ. 2,100 కోట్లు) లంచం చెల్లించే పథకంలో భాగంగా అదానీపై US ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. "సహజంగానే ఈ ఆరోపణల గురించి మాకు తెలుసు, అదానీ గ్రూప్‌పై ఆ ఆరోపణలకు సంబంధించిన అంశంపై SEC (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్), DOJ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్)కి సరైన సమాధానం ఇవ్వగలవని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ తెలిపారు. భారత్-అమెరికా సంబంధాలు దృఢంగా ఉన్నాయని, ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు కలిసి అధిగమిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
అదానీకి మరో బిగ్ షాక్, ఆ ఒప్పందాలు రద్దు చేసుకుంటూ కెన్యా ప్రభుత్వం ప్రకటన
అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైన సంగతి విదితమే. యూఎస్ కోర్టు ఆయనపై మోసం, లంచం ఆరోపణలపై అరెస్టు వారెంట్ కూడా జారీ చేసింది.భారత్‌లో సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడానికి అదానీ గ్రూప్.. వివిధ రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు 265 మిలియన్ డాలర్లు (రూ. 2,238 కోట్లు) లంచంగా ఇవ్వజూపినట్టు న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు, అదానీ గ్రీన్ ఎనర్జీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానీతో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదవ్వడమే గాకుండా అరెస్టు వారెంట్ కూడా జారీ అయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
భారత్‌లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రణాళికల్లో భాగంగా ఎలాంటి పోటీ లేకుండా కాంట్రాక్ట్ టెండర్లను దక్కించుకొనేందుకు ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్ముకశ్మీర్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లోని ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు రూ. 2,238 కోట్ల మేర లంచాలు ఆఫర్ చేసినట్టు అమెరికా ఎఫ్‌బీఐ తన ఆరోపణల్లో వెల్లడించింది.తద్వారా వచ్చే 20 ఏండ్లలో కనిష్ఠంగా 2 బిలియన్ డాలర్లు లబ్ధి పొందేందుకు అదానీ గ్రూప్ ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆరోపించింది.ఈ డబ్బును సేకరించడానికి బ్యాంకులు, పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపుచ్చే ప్రయత్నాలు చేసినట్టు యూఎస్ లో కేసు సారాంశం.
అమెరికా ఫెడరల్ కోర్టులో అదానీకి సంబంధించి ముఖ్యంగా రెండు అభియోగాలు నమోదైనట్టు అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్ వెల్లడించింది. అందులో ఒకటి.. తప్పుడు సమాచారం చూపించి 2 బిలియన్ డాలర్ల మేర రుణాలకు అర్జీ పెట్టడం కాగా రెండోది.. అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన భరోసాను చూపించి అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని మదుపర్లకు 1 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను ఆఫర్ చేయడం. ఈ రెండు అభియోగాలపై న్యూయార్క్‌లోని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ కోర్టు అదానీ సహా ఏడుగురికి నోటీసులు జారీ చేసింది.
మరోవైపు, ఫెడరల్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించిన కారణంగా గౌతమ్ అదానీ, సాగర్ అదానీతో పాటు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న అజురా పవర్ అనే కంపెనీకి కూడా ఇదే కేసులో తాము నోటీసులు పంపించినట్టు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఈ కేసులో నిందితులు ఎఫ్‌బీఐ, ఎస్‌ఈసీ దర్యాప్తును అడ్డుకోవడానికి కుట్ర పన్నినట్టు కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.