
New Delhi, Feb 22: భారత టెక్టోనిక్ ప్లేట్ ప్రతి సంవత్సరం సుమారు 5 సెం.మీ కదులుతుందని, ఇది హిమాలయాల వెంబడి ఒత్తిడి పేరుకుపోవడానికి, పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం (Earthquake Fear in India) ఉందని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త, భూగర్భ నిపుణుడు హెచ్చరించారు.
హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జిఆర్‌ఐ) ప్రధాన శాస్త్రవేత్త, భూకంప శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు (NGRI chief scientist Dr N Purnachandra Rao) మంగళవారం ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. 'భూ ఉపరితలం నిరంతరం కదలికలో ఉండే వివిధ పలకలను కలిగి ఉంటుంది. కాగా ప్రతి సంవత్సరం 5 సెం.మీ.భారత ప్లేట్ కదులుతోంది.ఫలితంగా హిమాలయాల వెంబడి ఒత్తిడి పేరుకుపోయి పెను భూకంపం వచ్చే అవకాశం పెరుగుతుందని తెలిపారు.
మాకు ఉత్తరాఖండ్‌లో 18 సీస్మోగ్రాఫ్ స్టేషన్‌ల బలమైన నెట్‌వర్క్ ఉంది. హిమాచల్, ఉత్తరాఖండ్‌తో సహా నేపాల్ పశ్చిమ భాగానికి మధ్య భూకంప అంతరం అని పిలువబడే ప్రాంతం.. ఇది ఎప్పుడైనా సంభవించే భూకంపానికి గురయ్యే అవకాశం ఉందని ప్రధాన శాస్త్రవేత్త తెలిపారు.హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు ఉత్తరాన 56 కిలోమీటర్ల దూరంలో సోమవారం రాత్రి 10.38 గంటలకు 3.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని ఏజెన్సీ తెలిపింది. ఫిబ్రవరి 19న ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఏ క్షణంలోనైనా హిమాలయ పర్వత శ్రేణుల పరిధిలో భారీ భూకంపం సంభవించే ప్రమాదం పొంచి ఉందని.శక్తిమంతమైన కట్టడాల వల్ల ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తుందని, దీన్ని నివారించాల్సి ఉందని డాక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ భూకంపాలు రిక్టర్ స్కేల్‌పై 8గా నమోదు కావచ్చునని అంచనా వేశారు.హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భూకంపం సంభవిస్తే, ఇటీవల టర్కీలో జరిగిన భూకంపం స్థాయిలో నష్టం జరుగవచ్చుననని పూర్ణచంద్రరావు అంచనా వేశారు. `భూకంపాలను మనం నిలువరించలేం. నష్టాన్ని నివారించగలం. భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో భవనాల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజలు ఈ మార్గదర్శకాలు అనుసరించాలి` అని సూచించారు