National-level Amaravati Drone Summit 2024 (photo-X)

Vjy, Oct 22: కేంద్ర పౌరవిమానయాన శాఖ భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ నిర్వహించిన డ్రోన్ షో విజయవంతం అయింది. డ్రోన్ సమ్మిట్ లో భాగంగా విజయవాడలోని పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేసిన ఈ భారీ ఈవెంట్ లో డ్రోన్ విన్యాసాలు అచ్చెరువొందించాయి. విజయవాడ కృష్ణా నదీ తీరంలో నిర్వహించిన దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో కళ్లు జిగేల్ ‌‌మనిపించింది.

రేపు తుపానుగా బలపడనున్న వాయుగుండం, ఉత్తరాంద్రకు హైఅలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు మోస్తారు నుంచి భారీ వర్ష సూచన

సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో ముగిశాక... 5 వేలకు పైగా డ్రోన్లు గాల్లోకి లేచాయి. డ్రోన్లు వివిధ కళాకృతులతో అందరినీ అలరించాయి. విమానం, బుద్ధుడు, గ్లోబ్ పై భారతదేశ మ్యాప్, డ్రోన్ కల్చర్, 1911 నాటి పోస్టల్ స్టాంపు, భారత త్రివర్ణ పతాకం... ఇలా వివిధ రూపాల్లో డ్రోన్ లైటింగ్ షో కనులవిందు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. కాగా, ఈ డ్రోన్ షోను ప్రజలు వీక్షించేందుకు వీలుగా విజయవాడలో ఐదు చోట్ల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

National-level Amaravati Drone Summit 2024 Videos

సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు ఈ భారీ ఈవెంట్ కు హాజరై అత్యంత ఆసక్తితో తిలకించారు. ఈ కార్యక్రమంలో, సీఎం చంద్రబాబు డ్రోన్ హ్యాకథాన్ విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేశారు. డ్రోన్ షో సందర్భంగా పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో 'కృష్ణం వందే జగద్గురుం' కళా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తమ్మీద ఈ డ్రోన్ షో ఏపీ ప్రభుత్వ విజన్ ను చాటేలా, టెక్నాలజీ పట్ల సీఎం చంద్రబాబు అనురక్తిని వెల్లడించేలా సాగింది.

ఇక ఈ డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులు నమోదు చేసింది. తద్వారా విజయవాడ డ్రోన్ షో చరిత్ర సృష్టించింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు సర్టిఫికెట్లు అందజేశారు.

1. డ్రోన్లను ఉపయోగించి అతి పెద్ద భూగోళం ఆకృతి 2. అతి పెద్ద ల్యాండ్ మార్క్ 3. అతి పెద్ద విమానం 4. అతి పెద్ద జాతీయ జెండా 5. ఏరియల్ లోగో... ఇలా విజయవాడ డ్రోన్ షో ఐదు అంశాల్లో ప్రపంచ రికార్డులు నెలకొల్పింది.