Visakha, Oct 15: విశాఖ జిల్లాలో వైన్‌షాపుల కోసం ఒకవైపు కూటమి ప్రజాప్రతినిధులు, సిండికేట్లు పెద్ద ఎత్తున పోటీ పడగా..తాజాగా ఢిల్లీకి చెందిన లిక్కర్ వ్యాపారి కూడా విశాఖ జిల్లాలో మద్యం వ్యాపారంపై దృష్టి పెట్టాడు. ఏకంగా 155 వైన్‌షాపులకు దరఖాస్తులు చేశాడు. అమిత్ అగర్వాల్, నందినీ గోయల్, సారికా గోయల్, సౌరభ్ గోయల్ పేర్లతో ఈ వ్యాపారి దరఖాస్తులు సమర్పించాడు.
ఒక్కో దుకాణ లాటరీకి దరఖాస్తు చేసిన 24 నుంచి 30 మంది మారుతున్నప్పటికీ ఆయన మాత్రం అక్కడి నుంచి కదలలేదు. వరుసగా అన్ని షాపుల లాటరీ నిర్వహణలోను పాల్గొనడంతో ఎక్సై జ్ అధికారులు.. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎక్సైజ్ సిబ్బంది ద్వారా ఆరా తీశారు. అతడిని ప్రశ్నించిన ఎక్సై జ్ అధికారులతో పాటు కలెక్టర్, జేసీ కూడా విస్తుపోయారు.
155 షాపులకు దరఖాస్తు చేసినట్లు ఆ వ్యాపారం చెప్పడంతో అందరూ ఖంగుతిన్నారు. అన్ని షాపులకు కలిపి దరఖాస్తు రుసుమే రూ.3 కోట్లుకు పైగా అవుతుంది. అంత స్థాయిలో దరఖాస్తు ఫీజు చెల్లించిన సదరు వ్యాపారికి లాటరీలో 6 షాపులు దక్కాయి. ఇక ఒడిశా నుంచి కూడా లిక్కర్ కింగ్ వివేక్ సాహు 30 షాపులకు దరఖాస్తులు సమర్పించినప్పటికీ.. కేవలం 2 షాపులు మాత్రమే ఆయనకి లభించాయి.
ఉమ్మడి విశాఖ జిల్లాలో 331 మద్యం షాపులకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో విశాఖ జిల్లా పరిధిలోని 155 షాపులకు గానూ మంగళవారం సాయంత్రం 5 గంటల సమయానికి 878 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో షాపునకు సగటున 6 దరఖాస్తులు కూడా రాలేదు. అనకాపల్లి జిల్లాలో 136 షాపులకుగానూ 1,076 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో షాపునకు 8 దరఖాస్తులు వచ్చాయి. అల్లూరి జిల్లాలో 40 మద్యం షాపుల్లో 36 షాపులకు మాత్రమే దరఖాస్తులు రాగా... మరో 4 షాపులకు దరఖాస్తులు రాలేదు. 36 షాపులకు మొత్తం 330 దరఖాస్తులు వచ్చాయి.