New Delhi. Dec 23: ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మన దేశంలో కూడా రోజు రోజుకు ఒమిక్రాన్ కేసులు (Omicron Scare) పెరుగుతున్నాయి, తాజాగా కేసులు 236కు (Omicron Tally Breaches 236-Mark) చేరుకున్నాయి. ఇక డెల్టా కంటే ఒమిక్రాన్ కరోనా వేరియెంట్ సంక్రమణ శక్తి మూడురెట్లు ఎక్కువని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించడంతో... కొత్త వేరియెంట్‌ను కట్టడి చేయడానికి పలు రాష్ట్రాలు ఆంక్షల బాట (Restrictions Return in Several States) పట్టాయి. ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం దేశంలో కోవిడ్–19 తాజా స్థితిపై సమీక్ష నిర్వహించనున్నారు.
దేశ రాజధాని పరిధిలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు గుమిగూడ కుండా చూడాలని కలెక్టర్లకు ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) ఆదేశాలు జారీచేసింది. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలకు, పండుగలకు జనం గుమిగూడటాన్ని నిషేధించింది. 200 మందికి పరిమితమై వివాహ సంబంధ వేడుకలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం ప్రతి పాజిటివ్ కేసు శాంపిల్‌ను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపుతోంది. ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు 125కి చేరాయి.
ఇక రెండు డోసులు తీసుకొని వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను చూపితేనే జనవరి 1 నుంచి షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, రెస్టారెంట్లలోకి అనుమతిస్తామని హరియాణా ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ ప్రకటించారు. వ్యాక్సినేషన్ పూర్తయితేనే అధికారులతో సహా ఎవరినైనా ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రవేశం ఉంటుందని ఆదేశాలు జారీ అయ్యాయి.బహిరంగ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్టు హర్యానా సర్కారు వెల్లడించింది. ఇక డిసెంబర్ 30-జనవరి 2 వరకు ఎలాంటి వేడుకలు జరుపుకోవద్దని కర్ణాటక సర్కారు ఆదేశించింది. క్రిస్మస్, న్యూఇయర్ రోజున ముంబైలో పార్టీలను నిషేధించారు.
గొంతు దగ్గరే ఆగిపోతున్న ఒమిక్రాన్, ఊపిరితిత్తులకు ఎలాంటి ప్రమాదం లేదని చెబుతున్న ఎయిమ్స్ డాక్టర్లు
రోజురోజుకీ ఒమిక్రాన్ కేసులు (Omicron in India) పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ సర్కార్ అలర్ట్ అయ్యింది. నెల నెలా ప్రభుత్వ ఉద్యోగులు జీతం తీసుకోవాలంటే తమ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపించాల్సిందేనని నిబంధన విధించింది. తమ తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను చూపిస్తేనే ఉద్యోగులు తమ జీతాలను పొందుతారని పంజాబ్ సర్కార్ బుధవారం స్పష్టం చేసింది. రెండు డోసులు తీసుకున్నా, ఒక డోసు తీసుకున్నా, ఆ సర్టిఫికెట్‌ను ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని, అప్పుడే జీతం వస్తుందని తేల్చి చెప్పింది. అయితే ఇప్పటి వరకూ వ్యాక్సినేషన్ జోలికే వెళ్లని ఉద్యోగుల విషయంలో ఎలాంటి చర్యలు చేపడతారన్న విషయాన్ని మాత్రం ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనలేదు.
మరో రాష్ట్రం తమిళనాడు కూడా అలర్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు కేసులు, మరోవైపు కేరళలో ఏకంగా మొత్తం 24 మంది ఒమిక్రాన్ బారిన పడడంతో తమిళనాడు సరిహదుల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని పరిశోధించి అనుమతించేందుకు చర్యలు తీసుకున్నారు. సరిహద్దుల్లో అదనంగా వైద్య బృందాల్ని నియమించే విధంగా ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే, జిల్లాల కలెక్టర్లను మరింత అప్రమత్తం చేస్తూ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ మరో సారి హెచ్చరించడం గమనార్హం.
ఇక తెలంగాణలో కొవిడ్ పరిస్థితులపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో.. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని కోర్టు పేర్కొన్నది. రెండు, మూడు రోజుల్లో ఈ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసింది. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి వేడుకల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఢిల్లీ, మహారాష్ట్ర తరహా నిబంధనలు పరిశీలించాని కోర్టు సూచించింది. రాష్ట్రాల సరిహద్దుల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఒమిక్రాన్‌పై అప్రమత్తంగా ఉండాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.