PM Modi- Yeh Modi ki guarantee hai(Photo-ANI)

New Delhi, Sep 6: తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలు పెనురాజకీయ దుమారాన్నే సృష్టించాయి. ఇప్పటివరకు ఈ అంశంపై మౌనంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జరిగిన మంత్రుల సమావేశంలో స్పందించారు. ఈ వ్యాఖ్యలపై సరైన విధంగా స్పందించాలని ఆదేశించారు. ఈ నెల 9, 10 తేదీల్లో జీ20 సమావేశాల నేపథ్యంలో మోదీ బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు.

చరిత్ర లోతుల్లోకి వెళ్లవద్దని, రాజ్యాంగం ప్రకారం వాస్తవాలకు మాత్రమే కట్టుబడి ఉండాలని తెలిపారు. ఈ అంశంలో ప్రస్తుత, సమకాలిక పరిస్థితి గురించి మాత్రమే మాట్లాడాలని స్పష్టం చేశారు.ఇటీవల తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని సమూలంగా నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని మంత్రులను ఆదేశించారు.

సనాతన ధర్మం మతం కాదు అదొక జీవనయానం, ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపిన టీటీడీ చైర్మన్

ఈ సమావేశంలో ప్రధాని రెండు అంశాలపై వారికి స్పష్టతనిచ్చారు. మొదటిది సనాతన ధర్మంపై డీఎంకే నేత చేసిన సనాతన ధర్మం (Sanatan Dharma) వ్యాఖ్యలపై కఠినంగా స్పందించమన్నారు. రెండవది 'ఇండియా' 'భారత్‌' అంశంపై మాట్లాడవద్దని మంత్రులకు ప్రధాని మోదీ సలహా ఇచ్చారు. కేవలం పార్టీ అధికార ప్రతినిధులు మాత్రమే ఈ అంశంపై స్పందిస్తారని మిగతావారంతా సనాతన ధర్మాన్ని కించపరచిన వ్యాఖ్యలకు ధీటుగా సమాధానమివ్వాలని కోరారు.

రాష్ట్రపతి ఆహ్వాన పత్రికలతో పాటు జీ-20 విదేశీ అతిథులకు పంపిణీ చేస్తున్న పుస్తకాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ఇండియా (India)కు బదులు భారత్‌ అని ముద్రించింది. దీంతో ఆంగ్లంలోనూ దేశం పేరు ఇక భారత్‌ (Bharat) మాత్రమే ఉండేలా మార్పులు తీసుకురానున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.

ఉద‌య‌నిధి స్టాలిన్ తల తీసుకురావాల్సిందే, రూ. 10 కోట్లు చాలకుంటే ఇంకా ఎక్కువే ఇస్తా, అయోధ్య హిందూ ధర్మకర్త అచార్య తాజా స్టేట్ మెంట్ ఇదిగో..

‘సనాతన ధర్మ నిర్మూలన’ పేరుతో తమిళనాడు అభ్యుదయ రచయితలు, కళాకారుల సంఘం చెన్నైలో గత వారం ఓ సమావేశాన్ని నిర్వహించింది. ఉదయనిధి స్టాలిన్ ఈ సమావేశంలో మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. వీటిని కేవలం వ్యతిరేకించలేమని, అంతం చేయాలని, నిర్మూలించాలని, అదే విధంగా సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలని అన్నారు.

దీనిపై వివాదం రేగిన తర్వాత కూడా ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడానికి నిరాకరించారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని మళ్ళీ మళ్ళీ ఇదే మాట అంటానని తెగేసి చెబుతున్నారు. కేంద్రం కులవివక్షను పెంచి పోషిస్తోందని, నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడమే అందుకు నిదర్శనమన్నారు.

మరోవైపు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే (కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు) మాట్లాడుతూ, ఉదయనిధి స్టాలిన్‌కు మద్దతిచ్చారు. సమానత్వాన్ని ప్రోత్సహించని ఏ మతమైనా, మానవుడిగా హుందాగా జీవించేందుకు భరోసానివ్వని ఏ మతమైనా, తన దృష్టిలో మతం కాదని చెప్పారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఉదయనిధి స్టాలిన్ పైన ఆ వ్యాఖ్యలను సమర్ధించినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే పైన కూడా యూపీలోని రామ్‌పూర్‌లో కేసు నమోదైంది.ఇక ఉదయనిధి వ్యాఖ్యలు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఆయనపై తమిళనాడు, యూపీలో కేసులు కూడా నమోదయ్యాయి.