ప్రస్తుతం దేశం మొత్తం రామనామంతో నిండిపోయింది... రాముడు సామాజిక జీవితంలో పాలన మరియు సుపరిపాలనకు ప్రతీక, ఇది మీ సంస్థకు కూడా గొప్ప ప్రేరణగా మారుతుంది" అని ప్రధాని మోదీ అన్నారు.నాసిన్‌ను రిమోట్ నొక్కి భారత ప్రధాని ప్రారంభించారు. చారిత్రక ప్రదేశంలో నాసిన్ ఏర్పాటు చేయడం సంతోషకరం.నాసిన్‌ను ప్రారంభించడం ఆనందకరంగా ఉంది.
అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట కోసం 11 రోజుల అనుష్టానం చేస్తున్నానని ప్రధాని మోదీ తెలిపారు. అక్రమంగా దక్కే అధికారాన్ని స్వీకరించొద్దని రాముడు చెప్పాడని ఆయన అన్నారు. ధర్మానికి, నిష్పక్షపాత విధానాలకు రాముడే ప్రత్యక్ష నిదర్శనమని, ఆయన పాలన ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రభుత్వాల్లో పని చేసే అధికారులంతా శ్రీరాముడిని ప్రేరణగా తీసుకుని పని చేయాలన్నారు.
లేపాక్షిలో వీరభద్ర మందిరం దర్శించుకోవడం ఆనందంగా ఉంది. రామరాజ్య భావన నిజమైన భావన అని మహాత్మాగాంధీ చెప్పారు.ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు.గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదు.జీఎస్టీ తీసుకువచ్చి పన్నులను సరళతరం చేశాం,ప్రజల నుంచి వచ్చిన పన్నులు వారి సంక్షేమానికే వాడాలి,ఇదే రామరాజ్య సందేశమని ప్రధాని మోదీ అన్నారు. పన్నుల రూపంలో చెల్లించే ప్రతి పైసా ప్రజా సంక్షేమానికి వాడుతున్నామని తెలిపారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఐటీ చెల్లింపుల విధానాన్ని సరళతరం చేశామని తెలిపారు. పన్ను చెల్లించే వారి సంఖ్య ఏటీకేడు పెరుగుతుందని అన్నారు.
నాసిన్‌ను రిమోట్ నొక్కి ప్రారంభించిన భారత ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్‌లో రూ.720 కోట్ల అంచనాలతో ఏర్పాటు చేసిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్)ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం జగన్, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణ కేంద్రాన్ని అత్యంత భద్రత నడుమ కొనసాగే విధంగా నిర్మాణం పూర్తి చేశారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇక్కడి నుంచి గంటలో చేరుకునేంత దూరం ఉండటం కలిసొచ్చే అంశం.
ఐఏఎస్‌లకు ముస్సోరి, ఐపీఎస్‌లకు హైదరాబాద్ తరహాలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్‌ఎస్)కు ఎంపికైనవారికి ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఆవరణలోనే సోలార్ సిస్టం కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. శిక్షణలో భాగంగా అవసరమైన విమానాన్ని తీసుకొచ్చారు. నాసిన్ కోసం ప్రత్యేక రైల్వేలైన్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలలో భాగంగా 2014లో రాష్ట్రానికి అకాడమీ మంజూరైంది. 2015 ఏప్రిల్ 11న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అకాడమీకి శంకుస్థాపన చేశారు. NACIN కొత్త క్యాంపస్ దేశంలో రెండవది. పాలసముద్రం ట్యాంక్ ఉత్తర గట్టుపై 35 ఎకరాల స్థలంలో రూ.720 కోట్ల అంచనాతో దీనిని నిర్మించారు.
మార్చి 5, 2022 న, నిర్మాణ పనులు ప్రారంభమైనప్పుడు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భూమి పూజలో పాల్గొన్నారు. జాతీయ స్థాయి ప్రపంచ స్థాయి శిక్షణా సంస్థ.. 80 మంది ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారులు, 1,000 కంటే ఎక్కువ మంది గ్రూప్ A లేదా ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలలోని గ్రూప్ I అధికారులు ప్రభుత్వంలోని వస్తు మరియు సేవల పన్ను విభాగంలో పని చేసేందుకు శిక్షణనిస్తుంది.
ఈ అకాడమీ భవిష్యత్తులో నౌకలు, కంటైనర్ల ద్వారా నిషిద్ధ వస్తువులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను స్కానింగ్ చేయడానికి సముద్ర శిక్షణా కేంద్రంగా ఉపయోగించబడుతుంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులకు మాక్ ఎయిర్‌పోర్ట్, సీ కంటైనర్ ల్యాండింగ్ ప్లేస్‌తో పాటు మాదక ద్రవ్యాల కోసం రియల్ టైమ్ స్కానింగ్ కోసం ఇక్కడ శిక్షణ ఇవ్వబడుతుంది.