దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోట్లకు అధిపతులేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ADR) వెల్లడించింది. ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ADR ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ జాబితాలో రూ.510 కోట్ల విలువైన ఆస్తులతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అగ్రస్థానంలో (Rich Chief Minister in India) ఉన్నారు. ఆయన తర్వాత స్థానాల్లో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండూ (రూ.163కోట్లు), ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (రూ.63కోట్ల) నిలిచారు.
నాలుగవ స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.23.55కోట్లు. తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు స్టాలిన్, బసవరాజ్ బొమ్మైకి రూ.8కోట్ల ఆస్తులున్నాయని పేర్కొంది. బిహార్, ఢిల్లీ ముఖ్యమంత్రులు నితీశ్‌కుమార్, అరవింద్ కేజ్రీవాల్ రూ.3కోట్లు అని పేర్కొంది. అత్యల్పంగా కేరళ, హర్యానా ముఖ్యమంత్రులు సీఎం పినరయి విజయన్, మనోహర్ లాల్ కట్టర్ రూ.కోటికిపైగా ఆస్తులు కలిగి ఉన్నారని ఏడీఆర్ నివేదిక (ADR analysis) తెలిపింది.
ఈ జాబితాలో అందరికంటే తక్కువగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.15లక్షలుగా ఉన్నట్లు పేర్కొంది. మొత్తంగా 30 మంది ముఖ్యమంత్రుల్లో అందరూ కోటీశ్వరులే..వీరిలో 29 రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు ఉన్నారు.ఇక జమ్మూ కశ్మీర్‌కి ముఖ్యమంత్రి లేని విషయం తెలిసిందే.87శాతం మంది సీఎంలు కోటీశ్వరులేనని.. ప్రతి సీఎంకు సగటు ఆస్తులు రూ.33.96కోట్లు అని ఏడీఆర్ పేర్కొంది.
ఇదే నివేదికలో ముఖ్యమంత్రుల్లో 13 మంది (43శాతం)పై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, బెదిరింపులతో సహా తీవ్రమైన కేసులున్నట్లుగా అఫిడవిట్లలో పేర్కొన్నారని ఏడీఆర్ పేర్కొంది. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఐదేళ్లకుపైగా జైలు శిక్షతో కూడిన నాన్ బెయిలబుల్ నేరాలని తెలిపింది.