Hyd, Dec 5: తెలంగాణలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇళ్లు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొంత ఇళ్లు ఉంటే పేదలు ఆత్మగౌరవంతో, ఉన్నతంగా బతుకుతారని అన్నారు. కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి పేదలకు ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గురువారం ఉదయం ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ అప్లికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, పలువురు పాల్గొన్నారు.ఈ యాప్ ద్వారా రేపటి (శుక్రవారం) నుంచి ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక జరుగనుంది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. రూ.10 వేలతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైందని.. ఇవాళ రూ.5 లక్షలకు చేరుకుందన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి.. రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తున్నామన్నారు.ఇళ్లకు సంబంధించి విధి విధానాలు సరళీకృతం చేస్తూ యాప్ రూపొందించాం. ఈ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుంది. ఐటీడీఏ ప్రాంతాల్లో కోటాతో సంబంధం లేకుండా జనాభా ప్రాతిపదికన ఇళ్ల ప్రక్రియ జరుగుతుంది.
ఇందిరమ్మ ఇళ్లపై ఉన్న లోన్స్ తీర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా 7 వేల మందికి రుణ విముక్తి కలుగుతుంది. అర్హుల జాబితాను తయారు చేసి కేంద్రానికి పంపుతాం. మొదటి ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లను పంపిణీ చేయబోతున్నాం. 3500 ఇండ్లతో సంబంధం లేకుండా ఆదివాసులకు ప్రత్యేక కోటా ఉంటుంది.
2004 నుంచి 14 వరకు వైఎస్సార్ హయంలో 25లక్షల 4వేల ఇండ్లను పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరిగింది. ప్రతీ మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ కట్టబోతున్నాం ప్రజలు వచ్చి చూడవచ్చు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభానికి ఆహ్వానం పంపుతున్నాం. పొన్నం ప్రభాకర్ వెళ్లి వారిని పిలుస్తారు. కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపిస్తున్నాం. 7, 8, 9 తేదీల్లో ట్యాంక్ బండ్ ప్రాంతంలో పండుగ వాతావరణం ఉంటుందన్నారు.
కూడు, గూడు, గుడ్డ అందరికీ అందాలనేదే కాంగ్రెస్ సర్కార్ ఆలోచన అని చెప్పుకొచ్చారు. తొలిదశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. తొలిదశలో అత్యంత పేదలకే మొదటి ప్రాధాన్యం ఉంటుందన్ని స్పష్టం చేశారు. తొలిదశలో ఎస్సీలు, ఎస్టీలు, ట్రాన్స్‌జెండర్లు, అత్యంత పేదలకు ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.