Hyd, Dec 15: జనాభా ప్రాతిపదికన ఫలాలు అందాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన 98 శాతం మేరకు పూర్తయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మిగిలిన రెండు శాతం పూర్తయితే దేశానికే ఆదర్శంగా నిలిచే ఈ కులగణన తెలంగాణ ప్రజల మెఘా హెల్త్ ప్రొఫైల్‌గా మారుతుందని అన్నారు.
హైదరాబాద్‌లో నిర్మించిన కురుమ విద్యార్థి వసతి గృహ ట్రస్ట్ – దొడ్డి కొమురయ్య ఆత్మ గౌరవ కురుమ భవనానికి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య గారి పోరాటాలను స్మరించుకున్నారు. రజాకార్లను గ్రామాల్లోకి రాకుండా, దొరల పెత్తనాన్ని అడ్డుకోవడానికి దుడ్డుకర్రల సంఘం పెట్టి పోరాడిన గొప్ప యోధుడు దొడ్డి కొమురయ్యని అన్నారు.
చాకలి ఐలమ్మ పేరును యూనివర్సిటీకి పెట్టినట్టుగానే, దొడ్డి కొమురయ్య గారిని శాశ్వతంగా గుర్తుండిపోయేలా మంత్రివర్గ సహచరులతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. దొడ్డి కొమురయ్య భవన ప్రాంగణం ఒక విద్యా వేదిక కావాలి. విజ్ఞానం పంచాలి. కురుమ సోదరులకు విద్య కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఆఫర్ ను తిరస్కరించిన నందిని సిధారెడ్డి, ఇంటికి వెళ్లి మరీ అభినందించిన కేటీఆర్
రుణమాఫీ, వరికి బోనస్, ఉచిత విద్యుత్, రూ.500 లకే సిలిండర్, పేదలకు వైద్య సౌకర్యాలు అందించడం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కువగా బలహీన వర్గాలకు అందాయని చెప్పారు.తెలంగాణకు జమిందారుల తల్లి కాదు. బహుజనుల తెలంగాణ తల్లి ఉండాలి. ఏ తల్లి అయితే మన అమ్మ లాగా ఉంటుందో, అడక్కుండానే మన ఆకలిని గుర్తించి బుక్కెడు అన్నం పెడుతుందో అలాంటి తెలంగాణ తల్లిని తెచ్చుకున్నాం అన్నారు.
మన అమ్మకు ప్రతిరూపం. మన అక్కకు ప్రతిరూపం. ఒకపక్క వరి, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న వంటి తెలంగాణలో పండించే పంటతో పాటు నా బిడ్డలు చల్లంగా ఉండాలి. నా బిడ్డలు శాశ్వతంగా అభివృద్ధి పథంవైపు నడవాలని ఆశీర్వదించే తెలంగాణ తల్లిని మనం ప్రతిష్టించుకున్నామని అన్నారు.