Hyderabad, May 17: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా మరో 55 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 1509కు చేరింది. నిన్న నమోదైన మొత్తం కేసుల్లో 44 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే కాగా, సంగారెడ్డి జిల్లా నుంచి 2 మరియు రంగారెడ్డి నుంచి 1 కేసు నమోదైంది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో మరో 8 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు వలస వచ్చిన వారిలో 52 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు.
ఇక శనివారం మరో 12 మంది కోవిడ్-19 పేషెంట్లు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 971 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాయ్యారు. కొత్తగా కరోనా మరణాలేమి సంభవించలేదు, రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 34 గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 504 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. కరోనా పేషెంట్లకు 10 రోజులే చికిత్స, ఆ తరువాత డిశ్చార్జ్: మంత్రి ఈటల రాజేంధర్
Telangana's #COVID19 Report:
ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ లోనే కరోనా తీవ్రత కనిపిస్తుంది. అయినప్పటికీ కొందరు నగరవాసుల నిర్లక్ష్యం కారణంగా నగరంలో కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. పాతబస్తీ, సైదాబాద్ పరిధిలోని మాదన్నపేట్ కాలనీ ప్రాంతంలో నివాసముండే ఒకే అపార్ట్‌మెంట్‌కు చెందిన 25 మందికి కరోనావైరస్ సోకడం కలకలం రేపింది. బాధితుల్లో ఒక గర్భిని మరియు 11 నెలల చిన్నారి కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయం.
వీరంతా ఇటీవల ఆ అపార్ట్‌మెంట్లోని ఒక ఫ్లాట్ లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఆ వేడుకకు కోవిడ్-19 పేషెంట్ కు సన్నిహితుడైన ఒక వ్యక్తికి కూడా హాజరయ్యాడు. అతడి ద్వారానే అందరికీ కరోనా వ్యాప్తి చెంది ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అపార్ట్‌మెంట్‌తో పాటు చుట్టు పక్కల నివాసముండే కాలనీవాసులందరికీ అధికారులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.