Telangana Govt Logo (Photo-File Image)

తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. నవంబర్‌ 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పిచేందుకు అధికారులు అవకాశం కల్పించారు. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. కాగా ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొన్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఈ సంవత్సరం మే 20వ తేదీ నుంచి జూన్‌ 2 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించారు.

రెండో టెట్‌కు నవంబరులో నోటిఫికేషన్‌ జారీ చేసి జనవరిలో పరీక్షలు జరుపుతామని గత ఆగస్టులో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల సమయంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.టెట్‌ పేపర్‌-1కు డీఈడీ, పేపర్‌-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందేందుకు టెట్‌ అర్హత ఉండాలని చెబుతుండటంతో వేల మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు కూడా పరీక్షకు హాజరుకానున్నారు.

ఏపీ టెట్ ఫలితాల విడుదల, మీ రిజల్ట్స్ aptet.apcfss.in ద్వారా చెక్ చేసుకోండి, అర్హత సాధించిన అభ్యర్థులకు లోకేశ్ శుభాకాంక్షలు

టెట్‌ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు తొమ్మిది సార్లు పరీక్షలు నిర్వహించగా...జనవరిలో పదోసారి జరగనుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలుపుకొని ఆరుసార్లు పరీక్షలు జరిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వహిస్తుండటం విశేషం.