New Delhi, July 6: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు నరేంద్ర మోదీ సర్కారు సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీన కేంద్ర మంత్రివర్గ విస్తరణ (Modi Cabinet Reshuffle) చేపట్టనున్నారు. ఆ రోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఈ సారి కొత్తగా 22 మందికి కేంద్ర కేబినెట్‌లో చోటు లభించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే పలువురు మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగబోయే రాష్ట్రాలకు ప్రధాని మోదీ (PM Modi) అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర కేబినెట్‌లో మొత్తం 81 మంది మంత్రులకు అవకాశం ఉండగా, ప్రస్తుతం 53 మందితోనే కేంద్ర కేబినెట్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మిగతా 28 స్థానాలనుఈ ఈ విస్తరణలో (Cabinet Expansion) భర్తీ చేసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే పలువురు ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. ఇండోర్ నుంచి ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా (Jyotiraditya Scindia), జనతాదళ్ నేత సీపీ సింగ్ సైతం దేశ రాజధానికి చేరుకున్నారు. ఇండోర్ నుంచి ఢిల్లీకి బయలుదేరే ముందు జ్యోతిరాదిత్య సింధియా ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అటు అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ కూడా గువాహటి నుంచి ఢిల్లీ వెళ్లారు. బీజేపీ ఎంపీ నారాయణ్ రాణె ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అటు జేడీయూ సీనియర్ నేతలు లల్లన్ సింగ్, ఆర్సీపీ సిన్హా ఈ ఉదయమే ఢిల్లీకి వచ్చినట్లు తెలుస్తోంది.
కేంద్ర కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్న వేళ కీలక మంత్రులు, బీజేపీ జాతీయాధ్యక్షుడితో నేడు జరగాల్సిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ రద్దయ్యింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరగాల్సి ఉంది. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రదాన్, ప్రహ్లాద్ జోషీ, పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్‌తో పాటు బీజేపీ జాతీయాధ్యక్షడు జేపీ నడ్డా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈ భేటీలో పాల్గొంటారని వార్తలు వచ్చాయి.
కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రుల పనితీరు, భవిష్యత్ పథకాలపైనే ప్రధానంగా చర్చ జరగనుందని తెలిసింది. అయితే అనూహ్యంగా ఈ భేటీ రద్దయినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఎందుకు రద్దు చేశారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇదిలా ఉంటే గత ఆదివారం ప్రధాని మోదీ, అమిత్ షా, బీఎల్ సంతోష్ సుదీర్ఘంగా సమావేశమవటం క్యాబినెట్ విస్తరణకు మరింత బలం చేకూర్చింది.
2019లో మోదీ రెండో దఫా ప్రధాని పదవి చేపట్టిన తర్వాత నుంచి ఇంతవరకూ మంత్రివర్గ విస్తరణ చేపట్టలేదు. నిబంధనల ప్రకారం.. కేంద్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 81 మంది మంత్రులు ఉండొచ్చు. అయితే ప్రస్తుతం కేబినెట్‌లో 53 మంది మాత్రమే ఉన్నారు. చాలా మంత్రుల వద్ద ఒకటికంటే ఎక్కువ మంత్రిత్వ శాఖలు ఉండగా.. కొన్ని శాఖలకు సహాయమంత్రులు లేరు. దీంతో మంత్రివర్గ విస్తరణపై కేంద్రం దృష్టిపెట్టింది.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. దీంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో పడింది. బల నిరూపణలో కాంగ్రెస్ పార్టీ విఫలం కావడంతో ముఖ్యమంత్రిగా కమలనాథ్ రాజీనామా చేశారు. సింధియా టీం అండతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ పగ్గాలు చేపట్టారు. ఎంపీలో కాంగ్రెస్ సర్కారును కూల్చిన సింధియాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తామని అప్పట్లో పార్టీ అధిష్ఠానం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సింధియాకు పదవి రావడం ఖాయమనే తెలుస్తోంది.
ఇక బీజేపీ మిత్రపక్షమైన జేడీయూకు కూడా ఈ సారి కేబినెట్‌లో స్థానం కల్పించాలని మోదీ సర్కారు భావించింది. తమకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని జేడీయూ కోరింది. అయితే ఒకరికి కేబినెట్ పదవి ఇచ్చి.. మరొకరిని సహాయ మంత్రిని చేస్తామని బీజేపీ చెప్పినట్లుగా తెలుస్తోంది. 2019లో రెండో దఫా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు సమయంలోనే జేడీయూకు ఒక కేబినెట్ పదవి ఇస్తామని కాషాయ దళం పార్టీ ఆఫర్ చేసింది. అయితే దాన్ని నితీశ్ కుమార్ తిరస్కరించారు.