Bengaluru, May 26: బెంగళూరు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులతో పాటు రాజకీయ అంశాలపై (CM KCR on National Politics) అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ (CM KCR after meeting Devegowda)మాజీ సీఎం కుమారస్వామితో కలిసి విలేకరులతో మాట్లాడారు.కేంద్రంలో మార్పు తథ్యమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ మార్పును ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. రెండు మూడు నెలల తర్వాత (Sensational news in 2-3 months) సంచలన వార్త వింటారని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఇప్పటికే ఎందరో ప్రధానులు దేశాన్ని పరిపాలించారని, ఎన్నో ప్రభుత్వాలు రాజ్యాన్ని ఏలాయని.. అయినా.. దేశ పరిస్థితి ఏమాత్రం మారలేదని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అన్నారు. ఇన్ని సంవత్సరాలు గడచినా… ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వుండిపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.భారత్ కంటే తక్కువ జీడీపీ వున్న చైనా ఇప్పుడు ఆర్థికంగా ప్రపంచాన్ని శాసిస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం మాత్రం 5 ట్రిలియన్ డాలర్ల బిజినెస్ అంటూ ప్రచారం చేస్తోందని, ఇది దేశానికే అవమానమని అన్నారు. నిజంగా మనసు పెట్టి అభివృద్ధి చేస్తే.. అమెరికా కంటే ఆర్థికంగా మనమే ఫస్ట్ ప్లేస్‌లో వుంటామని కేసీఆర్ ప్రకటించారు.
ప్రస్తుతం దేశంలో స్వతంత్ర భారత అమృతోత్సవాలను జరుపుకుంటున్నామని, అయినా… కరెంట్ కోసం, మంచినీళ్ల కోసం, సాగు నీటి కోసం ఇంకా అల్లల్లాడుతూనే వుందని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎవరి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నది ఇక్కడ ప్రధానం కాదని, ఒక ఉజ్వల భారతం కోసం శ్రమించాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు. దేశంలోని ఏ వర్గం కూడా మోదీ పాలనతో సంతోషంగా లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. రోజురోజుకీ పరిస్థితి దిగజారిపోతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు కుమారస్వామి తెలిపారు. కన్నడ భాషలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం అనేక మంది నేతలతో కేసీఆర్ భేటీ అవుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నట్లు కర్నాటక మాజీ సీఎం అన్నారు. దేశాన్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ కొత్త ఫ్రంట్‌కు ప్రయత్నిస్తున్నట్లు కుమారస్వామి చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం మార్పు అవసరం అని, పేద ప్రజల కోసం కూడా మార్పు కావాలని కేసీఆర్ కాంక్షిస్తున్నారని హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు.
ప్రధానంగా కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. రాబోయే సాధారణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దేవెగౌడతో చర్చించినట్లు సమాచారం.