Vjy, Jan 24: వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు చేసిన ప్రకటనపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం, వదిలి వెళ్లిపోవడం ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు. ఇది ధర్మమేనా అని ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి ప్రకటనపై బండ్ల గణేశ్ మాత్రమే కాదు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కూడా షాక్‌కు గురయ్యారు. జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్లిపోవడం సరైన నిర్ణయమేనా అని సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
విజయసాయి రెడ్డితో బండ్ల గణేశ్‌కు చాలాకాలం నుంచే విబేధాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో విజయసాయి రెడ్డిపై విమర్శలు గుప్పించారు. మార్గదర్శిలో సోదాల సమయంలో కూడా ఇలాగే స్పందించారు. మీకు మంచి సమాచారం అందిస్తూ.. మంచి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దుతా అంటూ విజయసాయిపై సెటైర్లు కూడా వేశారు. కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ (ఎక్స్) వేదికగా విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లుగా ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ప్రకటించారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తానని తెలిపారు. ఇది ఏ పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. వేరే పదవులు, ప్రయోజనాలు, డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదని తెలిపారు.