Disha Case Encounter in Supreme Court | (Photo Credits: ANI)

New Delhi, December: దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై నిజానిజాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు స్వయంగా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తుంది. బుధవారం ఈ ఎన్‌కౌంటర్‌ (Disha Case Encounter)కు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసులో ఎలాంటి వాద ప్రతివాదనలు వినకుండానే చీఫ్ జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తమకు ఈ ఎన్‌కౌంటర్‌ (Hyderabad Encounter) కు సంబంధించిన పూర్తి సమాచారం ఉందని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)తో ఎలాంటి లాభం ఉండబోదని నిర్ణయానికి వచ్చిన సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court), ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి న్యాయ విచారణ చేపట్టేందుకు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కమిటీ వేయాలని ప్రతిపాదించింది. ఆ కమిటీ కూడా హైదరాబాద్ నుంచి కాకుండా దిల్లీ నుంచే విచారణ చేస్తుందని స్పష్టం చేసింది. ఈ కమిటీ ఏర్పాటు కోసం పిటిషనర్లు లేదా తెలంగాణ ప్రభుత్వం న్యాయమూర్తుల పేర్లు సూచించాలని తెలిపింది. దీనిపై తెలంగాణ (Telangana) ప్రభుత్వ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలపగా, ఈ అంశాలపై రేపు చర్చిద్దామని పేర్కొంటూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

సుప్రీం నిర్ణయం ఎన్‌కౌంటర్‌కు పాల్పడిన తెలంగాణ పోలీసులకు ఇబ్బందికరమైన అంశమనే చెప్పవచ్చు. అయితే ఇప్పటికీ ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదు. రేపు ఇదే అంశంపై ఇరుపక్షాల అభ్యంతరాలను పరిశీలించి తదుపరి ఉత్తర్వులను వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

అలాగే గురువారం హైకోర్టులో ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరగాల్సి ఉంది. కాకపోతే సుప్రీంకోర్టే నేరుగా ఈ కేసులో జోక్యం చేసుకుంటుండంతో సుప్రీం నిర్ణయంపైనే హైకోర్ట్ నిర్ణయమూ ఆధారపడి ఉంటుంది. దిశపై హత్యాచారం చేసిన నలుగురిలో ఇద్దరు మైనర్లు. చదవండి

మరోవైపు, హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై హక్కుల కమీషన్ (NHRC) విచారణ పూర్తయింది. ఇక NHRC బృందం దిల్లీ తిరుగు ప్రయాణం అవుతుంది. తమ విచారణకు సంబంధించిన నివేదికను రేపు సుప్రీంకోర్టుకు అందజేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నిందితులను చాలా దగ్గరి నుంచి కాల్చడం ద్వారా బుల్లెట్లు వారి శరీరాన్ని చీల్చుకొని బయటకు వెళ్లాయని, ఈ విషయాన్ని తమ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.

ఇక, ఈ ఎన్‌కౌంటర్‌లో కీలకంగా వ్యవహరించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రస్తుతం దిల్లీ పర్యటనలోనే ఉన్నారు. ఆయన కేంద్ర హోంశాఖకు చెందిన ఉన్నతాధికారులతో భేటీ అవుతున్నట్లు సమాచారం.  ఈరోజు ఆయన సుప్రీంకోర్టులో విచారణకు హాజరుకాలేదని తెలుస్తుంది.

ప్రజల భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని తెలంగాణ పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌‌ చేశారని, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అలాగే నిందితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల చొప్పున నష్టపరిహారం కూడా ఇప్పించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ అనే ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేశారు.