
తెలంగాణ సంస్కృతిలో అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఈ పండుగ ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ వేడుకలో పూలకు, ప్రకృతికి, స్త్రీ శక్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సారి బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21న ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది. మొదటి రోజు జరిపే ఉత్సవాన్ని ఎంగిలి పూల బతుకమ్మ లేదా చిన్న బతుకమ్మ అని పిలుస్తారు.
బతుకమ్మలో తొలి రోజు ఏర్పాటు చేసే పూలు సాధారణంగా అందుబాటులో ఉన్న చిన్న పూలే. వీటిని పెద్దగా అలంకరించకుండా సరళంగా పేర్చి పండుగ ప్రారంభిస్తారు. వీటిని ఎంగిలి పువ్వు అని అంటారు. మొదటి రోజున తయారుచేసే బతుకమ్మ పరిమాణం చిన్నదిగా ఉండటం వల్ల దీనిని చిన్న బతుకమ్మ అని కూడా పిలుస్తారు. ఈ విధంగా ఎంగిలి పువ్వు బతుకమ్మతో పండుగ ఆరంభమై, చివరి రోజు సద్దుల బతుకమ్మతో మహోత్సవం ఘనంగా ముగుస్తుంది.
బతుకమ్మ పండుగలో ప్రధాన ఉద్దేశ్యం.. ప్రకృతి, పూలను దైవంగా ఆరాధించడం. తెలంగాణ మహిళలు ఈ తొమ్మిది రోజులలో ప్రతిరోజూ వివిధ రకాల పూలతో బతుకమ్మ పేర్చి, గీతాలు పాడుతూ, ఆటలతో ఆనందంగా గడుపుతారు. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా సాంస్కృతిక ఐక్యతకు ప్రతీకగా బతుకమ్మ పండగను చెబుతారు.


