Khairatabad Ganesh Visarjan (Photo/x)

Khairatabad Ganesh Visarjan 2025: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన ఊరేగింపులు దగ్గర పడుతున్న నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 6 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుండి అర్థరాత్రి వరకు ట్రాఫిక్ నియంత్రణలు అమల్లో ఉంటాయని అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వంటి ప్రధాన నిమజ్జన ప్రదేశాల వద్ద భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతంలో కఠిన ఆంక్షలు అమలు కానున్నాయి.

నగరంలోని ప్రతి ప్రధాన జంక్షన్‌లో ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. కర్బలా మైదాన్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను సెయిలింగ్ క్లబ్ మీదుగా కవాడిగూడ క్రాస్ రోడ్స్ వైపు మళ్లిస్తున్నారు. లిబర్టీ లేదా ఖైరతాబాద్ వైపు వెళ్లాలనుకునే వారు కవాడిగూడ క్రాస్ రోడ్స్, డిబిఆర్ మిల్స్, ధర్నా చౌక్, ఇందిరా పార్క్ ఎక్స్ రోడ్స్ వంటి మార్గాల ద్వారా ప్రయాణించవచ్చు. అదే విధంగా, ట్యాంక్ బండ్ మీదుగా పంజాగుట్టకు వెళ్లేవారు రాణిగంజ్, మినిస్టర్ రోడ్, బేగంపేట ద్వారా వెళ్లాల్సి ఉంటుంది.

పంజాగుట్ట, రాజ్ భవన్ నుండి ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పై అనుమతించడం లేదు. వాటిని ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు. అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ మార్గ్ వైపు ట్రాఫిక్‌ను ఆపి.. ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తున్నారు. ఇదే విధంగా ఇక్బాల్ మినార్ నుండి సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలను ట్యాంక్ బండ్ వైపు అనుమతించడం లేదు. తెలుగు తల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ ఆలయం, డిబిఆర్ మిల్స్, కవాడిగూడ ఎక్స్ రోడ్ ద్వారా మాత్రమే సికింద్రాబాద్ వైపు మళ్లిస్తున్నారు.

కవిత సస్పెండ్ వెనుక ఇంత కథ దాగుందా.. వరుస షాకులతో బీఆర్ఎస్ పార్టీ విలవిల, తట్టుకోలేక క్రమశిక్షణ పేరుతో సస్పెన్షన్ విధిస్తూ కేసీఆర్ కీలక నిర్ణయం

డిబిఆర్ మిల్స్ జంక్షన్ వద్ద కూడా ప్రత్యేక నియంత్రణలు అమల్లోకి వచ్చాయి. కట్టమైసమ్మ ఆలయం నుండి వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్ బండ్ వైపు అనుమతించకుండా, కవాడిగూడ ఎక్స్ రోడ్ వైపు మళ్లిస్తారు. ఇదే విధంగా ముషీరాబాద్ లేదా జబ్బార్ కాంప్లెక్స్ నుండి వచ్చే వాహనాలను సెయిలింగ్ క్లబ్ వైపు అనుమతించడం లేదు. నల్లగుట్ట వంతెన దగ్గర మినిస్టర్ రోడ్ నుండి నెక్లెస్ రోడ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కర్బలా వైపు మళ్లిస్తున్నారు. బుద్ధభవన్ నుండి నెక్లెస్ రోడ్ వైపు వెళ్లే వాహనాలను కూడా నల్లగుట్ట ఎక్స్ రోడ్స్ వద్ద మినిస్టర్ రోడ్ వైపు మళ్లిస్తున్నారు.

ఈ నియంత్రణలన్నీ ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్ ప్రవాహాన్ని బట్టి అమలు చేస్తామని పోలీసులు వెల్లడించారు. పౌరులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 9010203626 నంబర్ ద్వారా సహాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లోని గణేష్ నిమజ్జన ఊరేగింపులు ప్రతీ ఏటా లక్షలాది భక్తులు హాజరవుతుంటారు. ఈసారి కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు పౌరులను ఓపికగా ఉండాలని, మళ్లింపులను పాటించి సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నగరమంతా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయబడి, నిమజ్జన ప్రదేశాలు క్షుణ్ణంగా పర్యవేక్షణలో ఉంచబడ్డాయి.

ఇక ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం (Visarjan) ఈ సంవత్సరం సెప్టెంబర్ 6, 2025, శనివారం, అనంత చతుర్ధశి న జరగనుంది. ఈ తేదీ నాడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతి అద్భుతమైన శోభాయాత్ర తర్వాత హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనున్నారు.సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం ఉండటం వల్ల విశ్వశాంతి మహా గణపతిని నిమజ్జనం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖలు కలిసి సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పాడైన రహదారులను మరమ్మతు చేస్తున్నారు. ట్యాంక్ బండ్ ప్రాంతంలో ప్రత్యేక క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నారు. భక్తులకు తాగునీరు, వైద్య సేవలు, భద్రతా బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అన్ని చర్యలు అమల్లోకి తీసుకొస్తున్నారు.