MLC Kavitha Visits Nizamabad Market Yard, demands Bonus for Turmeric(X)

తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపు తీసుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఒక్కసారిగా బయటపడ్డాయి. గులాబీ పార్టీపై కొత్త తుఫాను వీచింది. ఆ పార్టీ ఎంఎల్‌సీ, కేసీఆర్ కూతురు కవితను పార్టీ నుంచి సస్పెండ్ సంచలన నిర్ణయం తీసుకుంది బీఆర్‌ఎస్‌ పార్టీ. ఇటీవలి కాలంగా కవిత పార్టీ లైన్‌కు విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె మాటలు, ప్రవర్తన పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించేలా ఉన్నాయని, క్రమశిక్షణా విరుద్ధంగా ఉన్నాయని పార్టీ అధిష్టానం భావించింది.

ఈ నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శి టీ. రవీందర్‌రావు, క్రమశిక్షణా వ్యవహారాల కమిటీ సభ్యుడు సోమ భరత్‌కుమార్‌ల పేరుతో అధికారిక లేఖ విడుదల చేశారు. అందులో కవితపై సస్పెన్షన్ నిర్ణయం స్పష్టంగా ప్రకటించారు. కాగ బీఆర్‌ఎస్‌ రజతోత్సవ వేడుకల సమయంలోనే కవిత–పార్టీ మధ్య గ్యాప్ మొదలైంది. ఆ వేడుకలో కేసీఆర్‌ ప్రసంగంపై ఆమె బహిరంగ లేఖ విడుదల చేయడం కలకలం రేపింది.

ఆ తరువాత వరుసగా తన సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డిని "లిల్లీపుట్" అంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీ లోపలే పెద్ద చర్చకు దారితీశాయి. అంతే కాకుండా ఇటీవల హరీష్‌రావు, సంతోష్‌రావులపై కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవన్నీ కలిసి పార్టీకి ప్రతిష్ట నష్టం కలిగించేలా ఉన్నాయని కేసీఆర్‌ భావించారు. చివరికి తన సొంత కూతురినే క్రమశిక్షణా కారణాలతో పార్టీ నుండి సస్పెండ్‌ చేయడం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది.

భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్‌ కలెక్టరేట్‌ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో

హరీష్‌రావు, సంతోష్‌రావులు అవినీతి అనకొండలన్న కవితపై బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల కవిత దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌ల్లొ కవిత ఫ్లెక్సీలను తొలగించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.

ఇప్పటివరకు షోకాజ్‌లు, విచారణలు లేకుండానే బహిష్కరణలు జరిపిన పార్టీ ఈసారి మాత్రం 12 ఏళ్లుగా మూలన పడిన క్రమశిక్షణా కమిటీని తెరపైకి తీసుకువచ్చి సస్పెన్షన్‌ నిర్ణయంతో సరిపెట్టింది. ఈ అసాధారణ పరిస్థితి కవిత భవిష్యత్తు రాజకీయాలపై ఊహాగానాలకు దారితీస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీహార్‌ జైలుకెళ్లొచ్చిన కవిత కొంతకాలం పాటు నిశ్శబ్దంగా ఉన్నా, 2025లో మాత్రం పూర్తిగా యాక్టివ్ అయ్యారు. కానీ ఈ యాక్టివిటీ బీఆర్‌ఎస్‌కే షాక్‌లు ఇచ్చేలా తయారైంది.

కవిత వరుస షాకులు ఇవే..

1.బహిరంగ లేఖ కలకలం: బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ సభలో కేసీఆర్‌ ప్రసంగంపై కవిత బహిరంగ లేఖ రాయడం, “కేసీఆర్‌ దేవుడే కానీ చుట్టూ దెయ్యాలు” అన్న వ్యాఖ్యలు పార్టీని గందరగోళంలోకి నెట్టాయి.

2. కేటీఆర్‌పై విమర్శలు: వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనులు చేయకుండా ట్వీట్లకే పరిమితం అవుతున్నారని బహిరంగంగానే అన్నది. ఆగష్టులో రాఖీ కూడా కట్టకపోవడం గుసగుసలకు దారితీసింది.

3. పార్టీకి దూరంగా ధర్నాలు: కాళేశ్వరం విచారణ నోటీసులపై ఇంద్రా పార్క్‌లో ధర్నా చేయగా, బీఆర్‌ఎస్‌ ఆందోళనలకు దూరంగా ఉంది.

4. కేటీఆర్‌ విచారణ – కవిత పర్యటన: అదేరోజు వర్కింగ్ ప్రెసిడెంట్‌ ఏసీబీ ముందు హాజరైతే, కవిత జగిత్యాలలో పర్యటించి వేరుగా అజెండా నడిపారు.

5. మల్లన్నపై లేఖ: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నపై మండలి చైర్మన్‌కు లేఖ రాసినా, పార్టీ మాత్రం దీనికి స్పందించలేదు.

6. డ్యూయల్‌ ఈవెంట్స్: ఉప్పల్‌లో కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌వీ సభ, అదే రోజు కొంపల్లిలో కవిత జాగృతి కార్యక్రమం. BRS కేడర్‌లో గందరగోళం సృష్టించింది.

7. బీసీ రిజర్వేషన్ల దీక్ష: పార్టీని పక్కన పెట్టి జై బీసీ – జై జాగృతి నినాదాలతో స్వతంత్ర పోరాటం చేపట్టారు.

8. జగదీష్‌రెడ్డి వివాదం: నల్లగొండలో జగదీష్ రెడ్డిపై “లిల్లీపుట్” వ్యాఖ్యలు మళ్లీ పార్టీని కష్టాల్లోకి నెట్టాయి.

9. హరీష్, సంతోష్‌పై బాంబ్: కాళేశ్వరం అవినీతి ఆరోపణల్లో వారిని లక్ష్యంగా చేసుకోవడం, కేసీఆర్‌పైనా సీబీఐ విచారణ డిమాండ్ చేయడం పెద్ద సునామీలా మారింది.

ఈ వరుస పరిణామాలన్నింటినీ కేసీఆర్ గమనించారు. సీనియర్ నాయకులతో చర్చలు జరిపి క్రమశిక్షణా లోపాన్ని సహించలేం అన్న కోణంలో కఠిన చర్య తీసుకున్నారు. కానీ బహిష్కరణకు బదులు సస్పెన్షన్‌కే పరిమితం కావడం, భవిష్యత్తు రాజకీయ ప్రభావాలపై కేసీఆర్ లెక్కలు వేసినట్టు కనిపిస్తోంది. సస్పెన్షన్‌ తర్వాత కవిత తదుపరి అడుగులు ఏంటన్నది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొత్త రాజకీయ దిశలో వెళ్తారా? లేక స్వతంత్ర బలాన్ని పెంచుకుంటారా? అనేది ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది.