
Vishwakarma Puja 2025: విశ్వకర్మ పూజ లేదా విశ్వకర్మ జయంతి హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. విశ్వానికి దైవిక వాస్తుశిల్పి, ఇంజనీర్‌గా పేరుపొందిన శ్రీ విశ్వకర్మకు ఈ పండుగ అంకితం చేయడం జరిగింది. ఆయన్ను ప్రపంచాన్ని నిర్మించిన సృష్టికర్తగా కొలుస్తారు. శిల్పకళలో ప్రతిభావంతుడైన దైవంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం ఈ పండుగ బెంగాలీ నెల భద్ర (సెప్టెంబర్) చివరి రోజున జరుపుకుంటారు. దీనిని భద్ర సంక్రాంతి అని కూడా పిలుస్తారు.
2025లో విశ్వకర్మ పూజ సెప్టెంబర్ 17న జరగనుంది. ఈ రోజు సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించే సమయమైన ఉదయం 1:55 గంటలకు సంక్రాంతి క్షణం ఉంటుంది. ఈ పండుగ ప్రధానంగా భారతదేశం, నేపాల్‌లోని కార్మికులు, వాస్తుశిల్పులు, ఇంజనీర్లు, మెకానిక్‌లు, టెక్నీషియన్‌లు, వివిధ శిల్పకళలకు సంబంధించిన వృత్తిదారులందరికీ అత్యంత ప్రాధాన్యం కలిగిఉంది.
పురాణాల ప్రకారం, శ్రీ విశ్వకర్మ అనేక మహత్తర నిర్మాణాలు, ఆయుధాలు, పుణ్యక్షేత్రాలను సృష్టించారు. శ్రీకృష్ణుడి కోసం ద్వారక నగరాన్ని నిర్మించగా, పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని తీర్చిదిద్దారు. అదేవిధంగా, శివుని త్రిశూలం, విష్ణువుకు సుదర్శన చక్రం, కార్తికేయునికి శక్తివంతమైన బల్లెం వంటి దివ్య ఆయుధాలు ఆయన సృష్టించినవిగా చెప్పబడుతుంది. హిందూ శాస్త్రంలో వాస్తుశిల్పం, యాంత్రిక శాస్త్రం, నిర్మాణ శాస్త్రాలపై ఆధారపడిన స్థపత్య వేదం కూడా విశ్వకర్మ రచనగా భావించబడుతుంది.
విశ్వకర్మ పూజ రోజున కర్మాగారాలు, వర్క్‌షాప్‌లు, ఆఫీసులు, గ్యారేజీలు, పరిశ్రమలు ప్రత్యేకంగా అలంకరించబడతాయి. యంత్రాలు, పనిముట్లు, వాహనాలు మరియు పనికొచ్చే సాధనాలను దైవంగా పరిగణించి వాటికి పూజలు చేస్తారు. ఈ పండుగ భక్తులలో కృతజ్ఞత భావాన్ని పెంపొందిస్తుంది. ఎందుకంటే మానవ జీవనోపాధి కోసం ఉపయోగించే సాధనాలు, యంత్రాలు మన సాంస్కృతిక ప్రగతికి మూలాధారాలుగా ఉన్నాయి
పూజ సందర్భంగా విశ్వకర్మ దేవునికి పుష్పాలు, పండ్లు, నైవేద్యం సమర్పిస్తారు. చాలా చోట్ల ఈ రోజు పనులు నిలిపేస్తారు. కార్మికులు, ఉద్యోగులు పండుగను కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా జరుపుకుంటారు. ఆనందానికి సూచికగా అనేక ప్రాంతాల్లో గాలిపటాలను ఎగురవేయడం ఈ పండుగ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, అసోం, ఒడిశా, త్రిపుర, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో విశ్వకర్మ పూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. పరిశ్రమలు, కర్మాగారాలు మూసివేయబడటం వల్ల ఇది ఉద్యోగుల కోసం విశ్రాంతి, ఉత్సవ సమయంగా పరిగణిస్తారు. ఆధునిక కాలంలో ఈ పండుగ వృత్తి ప్రగతిని, సాంకేతిక అభివృద్ధిని ప్రతిబింబించే పండుగగా మారింది.