
మన రోజువారీ జీవితంలో పీల్చే గాలి మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో తెలిసిందే. అయితే తాజాగా పెరుగుతున్న వాయు కాలుష్యం కేవలం ఊపిరితిత్తులు, గుండెను మాత్రమే కాదు, మన కీళ్లను కూడా తీవ్రంగా దెబ్బతీస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులు, హృదయ సమస్యలతో పాటు ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ (కీళ్ల వాతం) వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా కాలుష్య ప్రభావంతో పెరుగుతున్నాయని వారు స్పష్టం చేశారు.
ఇటీవల ఢిల్లీలోని ద్వారకలో జరిగిన ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ 40వ వార్షిక సదస్సు (IRACON 2025) లో నిపుణులు గాలి కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటివరకు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ప్రధానంగా జన్యు కారణాలతో ముడిపెట్టేవాళ్లం. కానీ ఇప్పుడు కాలుష్య గాలిలోని సూక్ష్మ ధూళి కణాలు (PM 2.5) కూడా ప్రధాన కారకంగా మారుతున్నాయి. ఈ కణాలు శరీరంలోకి ప్రవేశించి రోగనిరోధక వ్యవస్థను అతిగా స్పందించేలా ప్రేరేపిస్తున్నాయి. ఫలితంగా శరీరం తన సొంత కణజాలంపైనే దాడి చేస్తోందని ఢిల్లీ ఎయిమ్స్ రుమటాలజీ విభాగాధిపతి డాక్టర్ ఉమా కుమార్ తెలిపారు.
ఆమె ప్రకారం వంశపారంపర్యంగా ఎలాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల చరిత్ర లేనివారు కూడా కాలుష్య ప్రాంతాల్లో నివసించడం వల్ల ఈ వ్యాధికి గురవుతున్నారు. ఇది కేవలం వైద్య సమస్య కాదు, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి. మనం గాలి నాణ్యతపై కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆమె హెచ్చరించారు. డాక్టర్ పులిన్ గుప్తా, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ప్రొఫెసర్ మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో అధిక పీఎం 2.5 స్థాయిలు ఉన్న చోట్ల నివసించే రోగులలో వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. కీళ్ల నొప్పి వేగంగా పెరుగుతోంది, వాపు నియంత్రణ కష్టంగా మారుతోంది. పట్టణాల్లో పచ్చదనం తగ్గిపోవడం, వాయు ప్రసరణ తగ్గడం కూడా దీనికి కారణమని వివరించారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటే శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున తన సొంత కణజాలంపైనే దాడి చేయడం. దీనివల్ల కీళ్లలో తీవ్రమైన నొప్పి, వాపు, బిగుసుకుపోవడం వంటి సమస్యలు వస్తాయి. దీన్ని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు, కానీ సమయానికి గుర్తించి మందులు వాడితే నియంత్రించవచ్చు.భారతదేశంలో ఇప్పటికే దాదాపు 1 శాతం జనాభా ఈ వ్యాధితో బాధపడుతోంది. గాలి కాలుష్యం పెరుగుతున్న నేపథ్యలో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలిలోని కాలుషకాలు శరీరంలోని ఇన్‌ఫ్లమేటరీ ప్రక్రియలను ప్రేరేపించి కీళ్ల కణజాలాన్ని దెబ్బతీస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
నిపుణులు ప్రభుత్వాలకు పలు సూచనలు చేశారు:
గాలి నాణ్యత నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రజల్లో వాయు కాలుష్యం ప్రమాదాలపై అవగాహన పెంచాలి.
ఆటో ఇమ్యూన్ వ్యాధుల పట్ల ప్రమాదంలో ఉన్నవారికి ముందస్తు పరీక్షలు నిర్వహించాలి.
పచ్చదనం పెంచడం, వాహన ఉద్గారాలను తగ్గించడం, పరిశ్రమల నియంత్రణ వంటి చర్యలు తీసుకోవాలి.