Amaravati, Mar 16: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడినంటూ ముంబై వ్యాపారిని బురిడీ కొట్టించిన మాజీ రంజీ క్రికెటర్ నాగరాజును ముంబై సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ (Ex Ranji Cricketer Arrested) చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 28 ఏళ్ల బుడుమూరు నాగరాజు ఆంధ్రప్రదేశ్ మాజీ రంజీ క్రికెటర్.
అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్. ఆంధ్రప్రదేశ్ రంజీ ఆటగాడు రికీ భుయ్‌కు రూ.12 లక్షల స్పాన్సర్‌షిప్ (Duping Company of Rs 12 Lakh) కావాలని ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారికి ఫోన్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ (Andhra Pradesh Chief Minister) వ్యక్తిగత సహాయకుడినంటూ నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ), ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ), రికీ భుయ్‌ల పేర్లు వాడుకుని సొమ్మును కాజేశాడు.
పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన నాగరాజు.. గతంలో ఓ రాజకీయ నాయకుడు చేసిన మోసం వల్ల తాను ఈ తరహా మోసాలకు అలవాటు పడినట్లు తెలిపాడు. ఇక 2021లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ పలు కార్పొరేట్ కంపెనీలను రూ. 40 లక్షలు వరకు మోసగించినందుకు అరెస్టయ్యాడు. నాగరాజు 2018 నుంచి ఇప్పటి వరకు స్పాన్సర్‌షిప్ పేరిట ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 60కిపైగా కంపెనీలను రూ.3 కోట్ల మేర మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఎంబీఏ చదువుకున్న నాగరాజు 2014-2016 మధ్యలో ఆంధ్రప్రదేశ్ జట్టుకు (రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో), 2016-2018 మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఇండియా-బి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2016లో క్రికెట్‌కు సంబంధించి సుదీర్ఘ సమయం నెట్ సెషన్‌లో పాల్గొన్న బ్యాటర్ విభాగంలో గిన్నిస్ రికార్డుల్లోకెక్కేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.