IPL 2022: రైజర్స్‌ జోరుకు బ్రేక్‌ వేసిన గుజరాత్, ఆఖర్లో రషీద్‌ ఖాన్ విధ్వంసంతో విజయం సాధించిన గుజరాత్‌ టైటాన్స్‌, నిప్పులు చెరిగిన ఉమ్రాన్‌ అయినా తప్పని ఓటమి
Rashid Khan (left) and Rahul Tewatia (right) (Photo credit: Twitter)

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐదు వరుస విజయాల జోరుకు గుజరాత్‌ టైటాన్స్‌ బ్రేకులు వేసింది. ఆఖరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఉమ్రాన్‌ (5/25) ఐదు వికెట్లతో చెలరేగినా.. ఆఖర్లో రషీద్‌ (11 బంతుల్లో 4 సిక్స్‌లతో 31 నాటౌట్‌) విధ్వంసంతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను ( Gujarat Titans Fourth Consecutive Victory) ఓడించింది. మొత్తం 14 పాయింట్లతో టాప్‌కు దూసుకెళ్లింది.

ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టైటాన్స్‌ 5 వికెట్లతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు షాకిచ్చింది. హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (42 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), మార్క్‌రమ్‌ (40 బంతుల్లో 56; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. తర్వాత గుజరాత్‌ టైటాన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి గెలిచింది. వృద్ధిమాన్‌ సాహా (38 బంతుల్లో 68; 11 ఫోర్లు, 1 సిక్స్‌), తెవాటియా (21 బంతుల్లో 40 నాటౌట్‌ 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పాత్ర పోషించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఉమ్రాన్‌ మలిక్‌ (5/25) ఐదు వికెట్లతో చెలరేగినా జట్టుకు ఓటమి తప్పలేదు.

రియాన్ ప‌రాగ్‌తో కయ్యానికి దిగిన హ‌ర్షల్ ప‌టేల్, సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఇద్దరి ఫైట్ వీడియో

196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ను.. రైజర్స్‌ స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఉగ్రరూపమే ప్రదర్శించాడు. గంటకు 140కి.మీ వేగంతో నిప్పులు చెరిగే బంతులతో గుజరాత్‌ బ్యాటర్లను గడగడలాడించాడు. తుపాకి వదిలిన బుల్లెట్‌లా యమస్పీడ్‌కు స్వింగ్‌ను జోడిస్తూ వరుస విరామాల్లో వికెట్లు నేలకూల్చాడు. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(22) వికెట్‌తో మొదలైన ఈ కశ్మీర్‌ యువ సంచలనం వికెట్ల వేట ఆఖరి వరకు దిగ్విజయంగా కొనసాగింది. గిల్‌ తర్వాత కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(10), సాహా(68), మిల్లర్‌(17), మనోహర్‌(0) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తీసిన ఐదు వికెట్లలో నాలుగు వికెట్లు క్లీన్‌బౌల్డ్‌ కావడం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఓవైపు ఉమ్రాన్‌ ఐదు వికెట్లతో లీగ్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా..రైజర్స్‌ ఓటమివైపు నిలువడం అభిమానులను నిరాశపరిచింది.

విజయానికి చివరి 30 బంతుల్లో 61 పరుగులు కావాల్సి ఉండగా.. మిల్లర్‌, అభినవ్‌ మనోహర్‌ (0)ను బౌల్డ్‌ చేసిన ఉమ్రాన్‌ మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. కానీ, రషీద్‌తో కలసి తెవాటియా (Rashid Khan, Rahul Tewatia) పోరాడాడు. నటరాజన్‌ వేసిన 19వ ఓవర్‌లో 4,6 బాదిన తెవాటియా.. ఆఖరి ఓవర్‌లో విజయానికి 22 పరుగులుగా సమీకరణాన్ని మార్చేశాడు. ఇక, జాన్సెన్‌ వేసిన 20వ ఓవర్‌లో రషీద్‌ 3 సిక్స్‌లతో మోతెక్కించాడు. ఆఖరి బంతికి 3 పరుగులు అవసరం కాగా.. సిక్స్‌తో ఫినిష్‌ చేశాడు.