IPL 2022: ఐపీఎల్ తొలి పోరు నేడే, వాఖండే స్టేడియంలో రాత్రి 7. 30 నుంచి తలపడనున్న చెన్నై, కోలకతా, మూడు వేదికలు.. పది జట్లు, 65 రోజులు.. 74 మ్యాచ్‌లతో ఈ ఏడాది ఐపీఎల్
IPL Logo (Photo Credits: IANS)

క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. కరోనా కారణంగా గత రెండేండ్లుగా సగం మ్యాచ్ (IPL 2022) యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ ఈ సారి సొంత ప్రేక్షకుల మధ్య జరుగనుంది. రెండు నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించనున్న ఐపీఎల్‌ 15వ సీజన్‌కు (IPL 15th Session) నేటి నుంచి తెరలేవనుంది.లక్నో సూపర్‌ జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ రాకతో జట్ల సంఖ్య పదికి చేరగా.. టెన్నిస్‌ తరహాలో తొలిసారి సీడింగ్‌ పద్ధతిలో రెండు గ్రూప్‌లుగా లీగ్‌ జరుగనుంది.

సీజన్‌ ఆరంభ పోరులో గతేడాది ఫైనలిస్ట్‌లు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) తలపడనున్నాయి. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ తొలిసారి కేవలం ప్లేయర్‌గా మైదానంలో అడుగు పెట్టనుండగా.. మహీ సలహాలతో స్టార్‌ ఆల్‌రౌండర్‌ జడేజా జట్టును ముందుకు నడుపనున్నాడు. లీగ్‌లో ఇప్పటి వరకు ఆడిన 12 సీజన్‌లలో తొమ్మిదిసార్లు ఫైనల్‌కు చేరి నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిచిన చెన్నై మళ్లీ కప్ గెలిచేందుకు రెడీ అవుతోంది. ఇక కొత్త కెప్టెన్‌ అయ్యర్‌ సారథ్యంలో బరిలోకి దిగుతున్న కోల్‌కతా చెన్నైను తొలి మ్యాచ్ లో ఓడించేందుకు కసరత్తు చేస్తోంది.

మార్చి 26 నుంచి క్రికెట్ ప్రేమికుల పండగ IPL 2022 సీజన్ ప్రారంభం, పూర్తి షెడ్యూల్ వివరాలు మీకోసం...

మూడు వేదికలు.. పది జట్లు, 65 రోజులు.. 74 మ్యాచ్‌లతో..క్రీడాభిమానులను ఉర్రూతలూగించనున్న ఐపీఎల్‌ 15వ సీజన్‌కు (Indian Premier League (IPL) season 15) సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది విరాట్‌ కోహ్లీ, మహేంద్రసింగ్‌ ధోనీ తామంతట తామే కెప్టెన్సీకి వీడ్కోలు పలకగా..గతేడాది ఫైనల్‌కు చేర్చిన మోర్గాన్‌ను కోల్‌కతా కనీసం పట్టించుకోలేదు. భారత జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న హార్దిక్‌ పాండ్యా గుజరాత్‌ను గైడ్‌ చేయనుండగా..పంజాబ్‌కు కెప్టెన్సీ వహించిన కేఎల్‌ రాహుల్‌ లక్నోను లీడ్‌ చేయనున్నాడు.

ముంబైని రోహిత్‌, ఢిల్లీని పంత్‌, రాజస్థాన్‌ను శాంసన్‌, హైదరాబాద్‌ను విలియమ్సన్‌ లాంటి పాత సారథులు ముందుకు నడపనుండగా..కొత్తగా చెన్నైకి జడేజా, బెంగళూరుకు డుప్లెసిస్‌, కోల్‌కతాకు శ్రేయస్‌, పంజాబ్‌కు మయాంక్‌ కెప్టెన్‌లుగా వ్యవహరించనున్నారు. జట్ల సంఖ్య ఎనిమిది నుంచి పదికి పెరగడంతో.. గతంలో మాదిరిగా ఒక్కో జట్టు మరో జట్టుతో రెండేసి మ్యాచ్‌లు కాకుండా.. గ్రూప్‌ల విధానంలో తలపడనున్నాయి. ఒక్కో జట్టు 14 మ్యాచ్‌లు ఆడనుంది