ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటైన్ జాబితాను (IPL 2022 Retention) ప్రకటించాయి. ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన జట్టుగా.. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, బుమ్రాలను మాత్రమే రిటైన్ చేసుకుంది. కాగా ఆ జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ వదిలేసింది. అతనితో పాటుగా ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్ లను కూడా వదిలేసింది.
మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక ఆటగాళ్లను వదులుకోవడంపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పందించాడు. ఇప్పటి వరకు కలిసి ఆడిన ఆటగాళ్లు దూరం కావడంతో మనసంతా బాధగా (absolutely heart-breaking) ఉందన్నాడు. తనతో కలిసి ఆడిన ఈ ఆటగాళ్లు దూరం కావడంపై రోహిత్ స్పందించాడు.గన్ ప్లేయర్ల’ను వదులు కోవడం తనకు బాధగా ఉందన్నాడు. తమకు చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారని పేర్కొన్నాడు. ఎవరిని రిటైన్ చేసుకోవాలి? ఎవరిని వదులుకోవాలి? అనేది చాలా కఠినమైన నిర్ణయమని అన్నాడు.
ఫ్రాంచైజీ కోసం వారంతా అద్భుతంగా ఆడారని పేర్కొన్న రోహిత్.. చెరిగిపోలేని జ్ఞాపకాలను అందించిన వారిని వదిలేసుకోవడమంటే తట్టుకోవడం గుండెకు కొంచెం కష్టమైన పనేనని అన్నాడు. వేలంలో మంచి ఆటగాళ్లను సొంతం చేసుకుంటామని రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉంటే హార్దిక్ పాండ్యా ముంబైతో తనకున్న అనుబంధాన్ని వీడియో రూపంలో విడుదల చేశాడు. ''ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన క్షణాలను నా తర్వాతి జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటా. ఎన్నో ఆశలతో ఒక యంగ్‌స్టర్‌గా 2015లో ముంబై ఇండియన్స్‌లో అడుగుపెట్టిన నేను ఈరోజు అంతర్జాతీయ స్థాయ క్రికెటర్‌గా గుర్తింపు పొందాను. ఈ ఆరేళ్లలో ముంబై ఇండియన్స్‌కు ఒక మంచి ఆల్‌రౌండర్‌గా పనిచేశాను. నాకు ముంబై ఇండియన్స్‌తో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది.
View this post on Instagram
జట్టు ఆటగాళ్లతో స్నేహం.. ముంబై ఫ్యాన్స్ అభిమానం.. ఇవన్నీ నాకు గొప్పగా అనిపించాయి. ఇవాళ నన్ను ముంబై నన్ను వదిలేసి ఉండొచ్చు.. కానీ వారితో ఉన్న ఎమోషన్ మాత్రం ఎప్పటికి నాతోనే ఉంటుంది. ముంబై ఇండియన్స్‌తో ఇన్నాళ్లు కలిసి గెలిచాం.. కలిసి ఓడాం.. ఈ క్షణంలో దూరమవ్వడం బాధ కలిగిస్తుంది. అయినప్పటికి నా గుండెల్లో ముంబై ఇండియన్స్ పేరు మాత్రం ఎప్పటికి నిలిచిపోతుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక 2015లో కనీస ధర రూ.10 లక్షలకు ముంబై ఇండియన్స్‌లో అడుగుపెట్టిన హార్దిక్ నాలుగు ఐపీఎల్ టైటిళ్లు సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2019, 2020 సంవత్సరాల్లో ముంబై టైటిల్ గెలవడంలో హార్దిక్‌ది కీలకపాత్ర. అయితే గత కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న హార్దిక్ టీమిండియాలోనూ చోటు కోల్పోయాడు. టి20 ప్రపంచకప్ 2021కు ఆల్‌రౌండర్‌గా ఎంపికైనప్పటికి.. ఒక్క మంచి ప్రదర్శన లేక విమర్శల పాలయ్యాడు.