ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు.. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందున 12 లక్షల జరిమానా పడింది. ఐపీఎల్-2023లో భాగంగా ముంబై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆదివారం ముంబై ఇండియన్స్ తలపడిన సంగతి విదితమే.ముంబై రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అస్వస్థతకు గురైన నేపథ్యంలో అతడి స్థానంలో సూర్య సారథిగా వ్యవహరించాడు.
ఈ క్రమంలో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు ఈ మేర ఫైన్ విధించారు. ఇదే మ్యాచ్ లో ముంబై బౌలర్ హృతిక్ షోకీన్- కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా మధ్య వివాదం నేపథ్యంలో ఇద్దరికీ జరిమానా విధించారు ఐపీఎల్ నిర్వాహకులు. మైదానంలో పరస్పరం అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఇరువురి మ్యాచ్ ఫీజులో కోత విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని 2.21 నిబంధనను అతిక్రమించినందుకు గానూ నితీశ్ రాణా ఫీజులో 25 శాతం కోత పెట్టారు.
ఇక హృతిక్ షోకీన్.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని 2.5 నిబంధనను ఉల్లంఘించినందుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా నితీశ్ రాణా, హృతిక్ షోకీన్ దేశవాళీ క్రికెట్‌లో ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
Here's Video
— WPL MAHARASTRA (@WMaharastra) April 16, 2023
వీరిద్దరు ఢిల్లీ తరఫున ఆడుతూ సహచర ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. ఐపీఎల్‌లో వేర్వేరు జట్లకు ఆడుతున్న ఈ ఇద్దరు అనవసరపు గొడవతో చెత్తగా ప్రవర్తించి క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. తమ తప్పులు అంగీకరించి బీసీసీఐ విధించిన ఫైన్ రూపంలో మూల్యం కూడా చెల్లించుకున్నారు.
ఇక సొంత మైదానంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. కేకేఆర్‌ను 186 పరుగులకు కట్టడి చేసింది. వెంకటేశ్ అయ్యర్ సెంచరీ(104)తో మెరవడంతో కోల్‌కతా ఈ మేరకు స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో భాగంగా రోహిత్ శర్మ(20) ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఓ మోస్తరుగా రాణించగా.. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ(58)తో చెలరేగాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 43 పరుగులతో రాణించగా.. తిలక్ వర్మ 30, టిమ్ డేవిడ్ 24(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ముంబై ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది.