
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అదరగొట్టింది. వరుణుడు అంతరాయం కారణంగా ఆలస్యంగా మొదలైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌పై ఆర్‌సీబీ(Royal Challengers Bangalore ) అద్భుత విజయం సొంతం చేసుకుంది. తొలుత రజత్ పాటీదార్ ధనాధన్ సెంచరీతో కదంతొక్కితే ( Rajat Patidar Century) హాజిల్‌వుడ్ లక్నో జోరుకు బ్రేక్‌లు వేశాడు. హిట్టర్లు విఫలమైన వేళ పాటీదార్..ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారించాడు. లక్నో బౌలర్లను చీల్చిచెండాడుతూ భారీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌తో బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది.
బుధవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు 14 పరుగుల తేడాతో లక్నోపై అద్భుత విజయం సాధించింది. ఆర్‌సీబీ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యఛేదనలో లక్నో 193/6 స్కోరు చేసింది. రాహుల్(79), దీపక్ హుడా(45) రాణించారు. హాజిల్‌వుడ్(3/43) ఆకట్టుకున్నాడు. తొలుత రజత్ పాటీదార్(54 బంతుల్లో 112 నాటౌట్, 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో విజృంభించాడు. ఆఖర్లో దినేశ్ కార్తీక్(37నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. మోసిన్‌ఖాన్, కృనాల్ పాండ్యా, అవేశ్‌ఖాన్, బిష్ణోయ్‌కు ఒక్కో వికెట్ దక్కింది. సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించిన పాటీదార్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
బెంగళూరు నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యఛేదనలో లక్నో దీటుగా జవాబిచ్చే ప్రయత్నం చేసింది. ఓపెనర్ డికాక్(6) నిరాశపర్చగా, కెప్టెన్ కేఎల్ రాహుల్(79) తుదికంటా పోరాడాడు. మనన్ వోహ్రా(19) ఆకట్టుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో షాబాజ్ అహ్మద్ క్యాచ్‌తో వోహ్రా రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రాహుల్, దీపక్ హుడా(45) ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. వీరిద్దరు అడపాదడపా బౌండరీలు కొడుతూ లక్ష్యాన్ని అంతకంతకూ కరిగించే ప్రయత్నం చేశారు. అయితే బారీ షాట్ ఆడే క్రమంలో మార్కస్ స్టోయినిస్(9), లెవిస్(2 నాటౌట్), కృనాల్ పాండ్యా(0) పేలవ ప్రదర్శన కనబరిచారు. ఆఖరి వరకు గెలుపు కోసం ప్రయత్నించిన లక్నో ఆశలు నెరవేరకపోగా, 2016 తర్వాత ఆర్‌సీబీ తొలిసారి ఫైనల్‌కు చేరింది.
ఇక ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన జట్టుగా ఆర్‌సీబీ రికార్డులక్కెంది. ఐపీఎల్-2022లో ఇప్పటి వరకు 136 సిక్స్‌లు బాదిన ఆర్‌సీబీ ఈ ఘనత సాధించింది. గతంలో 2018 ఐపీఎల్ సీజన్‌లో కేకేఆర్ కొట్టిన 135 సిక్స్‌లు రికార్డును ఆర్‌సీబీ బ్రేక్ చేసింది.