ఐపీఎల్ 15 వ సీజన్‌లో బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో పరాజయం ఎదురైంది. తాజా మ్యాచ్‌లో మహేంద్రసింగ్ ధోనీ మునుపటి మెరుపులు మెరిపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఐపీఎల్ 15వ సీజన్‌లో రెండో విజయం (Second Victory of Season) నమోదు చేసుకుంది. గురువారం జరిగిన పోరులో చెన్నై 3 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. వరుసగా ఏడో మ్యాచ్‌లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ప్లే ఆఫ్స్ అవకాశాలకు అనధికారికంగా దూరమైంది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఠాకూర్ తిలక్ వర్మ (43 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ (32; 3 ఫోర్లు, ఒక సిక్సర్), అరంగేట్ర ఆటగాడు హృతిక్ షోకీన్ (25) ఫర్వాలేదనిపించారు. రోహిత్ శర్మ (0), ఇషాన్ కిషన్ (0), బ్రేవిస్ (4) విఫలమవడంతో ఒక దశలో ముంబై 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లు ముఖేశ్ చౌదరీ (3/19) ఖాతాలోకే వెళ్లడం విశేషం.చెన్నై ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు నేలపాలు చేయగా.. బ్రేవో రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై.. 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (0) ఇన్నింగ్స్ తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగగా.. అంబటి రాయుడు (40; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రాబిన్ ఊతప్ప (30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఆఖర్లో ధోనీ (13 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్), ప్రిటోరియస్ (14 బంతుల్లో 22; 2 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టడంతో చెన్నై చిందేసింది. ముంబై బౌలర్లలో డానియల్ సామ్స్ 4, ఉనాద్కట్ రెండు వికెట్లు పడగొట్టారు. ముఖేశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా శుక్రవారం ఢిల్లీతో రాజస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది.
ఐదుసార్లు ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు ముగిసినట్టే. ఆరు ఓటముల తర్వాత మిగతా ఎనిమిది మ్యాచ్‌ల్లో కచ్చితంగా నెగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. అయినా తమ ఏడో మ్యాచ్‌ను చెన్నైపై ఓడడంతో ఇక రోహిత్ సేనకు ఎలాంటి అవకాశాలు లేనట్టుగానే భావించాలి. మిగిలిన ఏడు మ్యాచ్‌లను గెలిచినా 14 పాయింట్లే ఉంటాయి. దీనికి తోడు జట్టు రన్‌రేట్ కూడా దారుణంగా ఉండడంతో ఈ జట్టుకు ఈసారి నిరాశ తప్పదు.