Republic Day Celebrations in AP: ఉగాది నాటికి 26 కొత్త జిల్లాలు, 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌
Republic Day Celebrations in AP

Amaravati, Jan 26: ఏపీలో విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో విజటర్స్‌కు అనుమతి నిరాకరించారు.

అనంతరం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగించారు. 'నవరత్నాల ద్వారా అభివృద్ధి ఫలాలు అందరికి అందుతున్నాయి. డీబీటి ద్వారా ఇప్పటి వరకు 1,67,798 కోట్లు ప్రభుత్వం పంపిణీ చేసినట్లు గవర్నర్ పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు క్షేత్ర స్థాయిలో విత్తన, ఎరువుల సేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.19,126 కోట్ల రైతు భరోసా ద్వారా ఆర్ధిక సాయం అందించినట్టు గవర్నర్ పేర్కొన్నారు. అమూల్ పాల వెల్లువ ద్వారా 9,899 పాల కేంద్రాల ద్వారా పాల సేకరణ చేస్తున్నట్టు తెలిపారు. రూ.3,177 కోట్ల వ్యయంతో 4 ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టింది.

రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపే మెసేజెస్, మీ బంధువులకు, స్నేహితులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండిలా..

విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. విద్యను భవిష్యత్‌కు పాస్ పోర్టుగా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు రూ. 34,619 కోట్లు వ్యయం చేసింది. మనబడి నాడు-నేడు కింద కొత్తగా స్కూళ్లు, కాలేజీలు అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో విద్యను తీసుకొచ్చారు. పేద విద్యార్థులకు బాసటగా జగనన్న అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు. జగనన్న విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన,గోరుముద్ద పథకాల ద్వారా విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతోంది.

ఆరోగ్య పరిరక్షణ కు గ్రామ స్థాయిలో 10,032 వైఎస్సార్ క్లినిక్‌లు, ఏర్పాటు చేసింది. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలలోని 138 ఆస్పత్రుల్లోను ఆరోగ్యశ్రీ పధకాన్ని అందిస్తున్నాం. కోవిడ్ నియంత్రణలో భాగంగా ఇప్పటి వరకు 3.2 కోట్ల నిర్దారణ పరీక్షలు చేసింది. రాష్ట్రంలోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. పడకలు, ఐసీయూ సౌకర్యం, ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాము. జనవరి 21 నాటికి 100 శాతం మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తి అయ్యింది. 15-18 ఏళ్ల వయసు ఉన్న వారికి 93 శాతం మేర వ్యాక్సిన్ పూర్తి చేశారు. ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్‌ అందిస్తున్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన 95 శాతం హామీలను నెరవేర్చాం. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది' అని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు.

ఉద్యోగుల సంక్షేమం మా ప్రభుత్వ ప్రాధాన్యత. 11వ పీఆర్సీలో భాగం గా 23 శాతం పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచింది. సంక్షేమ ఫలాలు పేద ప్రజలతో పాటు ఉద్యోగులకు చెందాల్సిన అవసరం ఉంది. 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పడుతాయి. రెండు జిల్లాలు ప్రత్యేకంగా గిరిజన ప్రాంత జిల్లాలుగా ఉంటాయి. సమీకృత అభివృద్ధి కోసం, పౌర సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందని అన్నారు.