విజయవాడ, ఏప్రిల్ 18: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన రాయి దాడి కేసులో సతీష్ అనే వ్యక్తిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కేసులో సతీష్ ఏ1గా ఉన్నాడు. నిందితుడు సతీష్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సీఎంపై రాయి విసిరింది అతనేనని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. న్యాయవాది కమిషనర్‌ను నియమించాలని పేర్కొన్నారు. సీఎం జగన్‌పై రాయి దాడి, నిందితుడి ఆచూకి చెప్పిన వారికి రూ. 2 లక్షలు నగదు బహుమతి ప్రకటించిన ఏపీ పోలీసులు
కాగా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో శనివారం రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్‌పై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడిన విషయం తెలిసిందే. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ పై భాగాన బలమైన గాయమైంది. విజయవాడ మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి..ముఖ్యమంత్రి ఎడమకంటి కనుబొమ్మపై గాయం
గాయం నుంచి కారుతున్న రక్తాన్ని సీఎం జగన్ అదిమిపట్టుకున్నారు. బాధను పంటిబిగువన భరిస్తూనే ప్రజలకు అభివాదం చేశారు. సీఎం జగన్ ఎడమ కంటి పై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. ప్రాథమిక చికిత్స తర్వాత సీఎం జగన్ యాత్ర కొనసాగించారు. అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.