
Amaravati, Mar 14: ఏపీలో కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నూజివీడు దగ్గర కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం (Gollapali Road Accident) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా..మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన (Krishna Road Accident) నూజివీడు మండలంలోని గొల్లపల్లి సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని..క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతుల వివరాలను వెల్లడించారు. మృతులంతా నూజివీడు మండలం లయన్ తండా వాసులుగా పోలీసులు తెలిపారు. వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న ఆటోను ( lorry hit an autorickshaw) బలంగా ఢీకొట్టింది. బాధితులను నూజీవీడు లయన్ తండాకు చెందిన కూలీలుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ రోడ్డు ప్రమాదంపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో కూలీలు మృతి చెందడం తనను ఎంతో బాధించిందన్నారు. పొట్ట చేతబట్టి బతుకు దెరువు కోసం వెళ్తున్న కూలీలు ఇలా మృత్యువాత పడడం అత్యంత బాధాకరమని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్ధిస్తూ.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 8మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.