Nellore, Dec 28: చంద్రబాబు కందుకూరు రోడ్ షోలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ మీటింగ్ కు (Chandrababu's TDP Meeting) కార్యకర్తలు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగి కొందరు కార్యకర్తలు డ్రైనేజీలో పడిపోయారు. అప్రమత్తమైన టీడీపీ నేతలు గాయపడిన కార్యకర్తలను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఏడుగురు మృతి (7 Dead in Stampede) చెందినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇరుకు సందుల్లో సభను ఏర్పాటు చేయడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.నేతలు పోటా పోటీగా జనసమీకరణ చేయాలని కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు అందడంతో పల్లెటూళ్ల నుంచి కార్యకర్తలను తరలించారు.
కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ రోడ్డు అరవై అడుగులు కూడా లేదు. ఆ అరవై అడుగుల రోడ్డును దుకాణాదారులు కొంత ఆక్రమించారు. రోడ్డుకు అటువైపు, ఇటువైపు డ్రైనేజీ గుంతలు ఉన్నాయి. దీనికితోడు ఇరువైపులా చంద్రబాబుకు స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలు కట్టారు. మరోవైపు ద్విచక్ర వాహనాలను నిలిపారు. దీంతో ఎన్టీఆర్ సర్కిల్ రోడ్డు ముప్ఫయి ఐదు అడుగులకు మించిలేదని చెబుతున్నారు.
కందుకూరు టీడీపీ టిక్కెట్ ను ఆశిస్తున్న ఇంటూరు రాజేష్, ఇంటూరు నాగేశ్వరరావు పోటా పోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, సభకు వచ్చిన వారి ద్విచక్ర వాహనాలు కూడా రోడ్డు పక్కనే పార్క్ చేయడంతో రోడ్డు ఇరుకుగా మారింది. నాలుగు వేలు పట్టే రోడ్డులోకి ఎక్కువ మంది జనం రావడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందనే వార్తలు వస్తున్నాయి.
దీంతో పాటు టిక్కెట్ ఆశిస్తున్న ఇరువురి నేతలకు చెందిన కార్యకర్తలు పోటా పాటీ నినాదాలు చేసుకుంటూ ముందుకు రావడంతోనే తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు.రోడ్డు చిన్నది కావడంతో చంద్రబాబును చూసే ఉత్సాహంతో దగ్గరకు వెళ్లాలన్న ప్రయత్నంలో తొక్కిసలాట జరిగి వీరంతా కాల్వలో పడపోయారని తెలుస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో సభలను ఏర్పాటు చేస్తే ఇటువంటి ప్రమాదాలు ఉండవనే వార్తలు వినిపిస్తున్నాయి.