Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్, త్వరలో భారీ ఎత్తున పదోన్నతులు, నోట్ విడుదల చేసిన విద్యాశాఖ, ఎయిడెడ్ స్కూల్ టీచర్లు ప్రభుత్వ సర్వీసుల్లోకి..
CM YS Jagan (Photo-Twitter/AP CMO)

Amaravati, Feb 9: ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ( Andhra Pradesh Govt Teachers) జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వీరికి భారీ ఎత్తున పదోన్నతులు (Promotions) లభించనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ (Education Ministry) నోట్ విడుదల చేసింది. ఈ నోట్ ను అన్ని జిల్లా, డివిజన్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పంపించింది. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలు, కార్యక్రమాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు మొత్తంగా పాఠశాల వ్యవస్థకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరనుందని ఆ నోట్‌లో పేర్కొంది.

రాష్ట్రంలోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో వచ్చే జూన్ లోగా దాదాపు 30 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కలగబోతోంది. మరోవైపు కొత్తగా 833 జూనియర్ కాలేజీలు రాబోతున్నాయి. దీంతో స్కూల్ అసిస్టెంట్లుగా ఉన్న వారికి జూనియర్ లెక్చరర్లుగా, ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపాల్ గా ప్రమోషన్ లభించనుంది.

ప్రస్తుతం 41 మండలాల్లో మహిళా కళాశాలలు ఉన్నాయి. 202 మండలాల్లో అసలు కళాశాలలే లేవు. ఈ మండలాల్లో ఒక కో ఎడ్యుకేషన్, ఒక బాలికల జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అంటే.. ఈ 202 మండలాల్లో కొత్తగా 404 జూనియర్‌ కాలేజీలు రానున్నాయి. మరో 429 మండలాల్లో ఒక్కో బాలికల కళాశాల ఏర్పాటు కానుంది. మొత్తంగా 833 కొత్త కళాశాలలు రానున్నాయి. మండల విద్యా శాఖ అధికారులు (ఎంఈవోలు) ఇక నుంచి పూర్తి స్థాయిలో విద్యా శాఖ బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా సెల్ఫ్‌ డ్రాయింగ్‌ అధికారాలు ఇవ్వనున్నారు.

జగనన్న చేదోడు నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం, రజక, నాయీబ్రాహ్మణ, దర్జీలకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సాయం, 2,85,350 మంది బ్యాంక్‌ ఖాతాల్లో రూ. 285.35 కోట్లు జమ

ప్రభుత్వం దీనిపై విధాన నిర్ణయం తీసుకుంది. మండల వనరుల కేంద్రంగా ఉన్న కార్యాలయాన్ని ఇక నుంచి మండల విద్యాశాఖ కార్యాలయంగా మార్చనున్నారు. ఎంఈవోలు దశాబ్దాలుగా ఈ డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యాలయంలో అవసరమైన సిబ్బందిని కూడా ప్రభుత్వం నియమించనుంది. మండల స్థాయిలో ఇద్దరు ఎంఈవోలను నియమిస్తారు. డివిజన్, జిల్లా స్థాయిలోనూ పోస్టులు పెరగనున్నాయని నోట్‌లో విద్యా శాఖ పేర్కొంది.

దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ స్కూలు ఉపాధ్యాయులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోనుంది. వీరికి జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో పోప్టింగ్ ఇవ్వనుంది. మొత్తం 5400 మంది టీచర్లు, తమ ఎయిడెడ్ పాఠాశాలలను ప్రభుత్వ పరిధిలో చేర్చారు. వీరంతా గత మూడు నెలల నుంచి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు.జగన్ సర్కారు ఈ ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వ పాఠశాలల్లో వీలీనం చేసేందుకు కసరత్తులు చేస్తోంది.