AP Government logo (Photo-Wikimedia Commons)

Amaravati April 10: ఏపీలో రెండు నెలల పాటు చేపల నిషేధం అమల్లోకి రానుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు. ఈ నిషేధం మెకనైజ్డ్ (యాంత్రిక), మోటార్ బోట్లకు వర్తిస్తుందని తెలిపారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. కాగా ప్రతీ ఏడాది చేపల ప్రత్యుత్పత్తి, గుడ్లు పెట్టే సమయంలో సముద్రంలో చేపల వేటపై నిషేధం విధిస్తుండడం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై నిషేధం విధించారు.

ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే ఐదు రోజులు మండిపోనున్న ఎండలు, బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక

వేసవి కాలం వివిధ రకాల చేపలు, రొయ్యలకు సంతానోత్పత్తి సమయం అని, అందుకే తల్లి చేపలు, రొయ్యలు మత్స్యకారుల వలలకు చిక్కుకోకుండా కాపాడేందుకు ఈ నిషేధం అని కన్నబాబు వివరించారు. ఒకవేళ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఎవరైనా మత్స్యకారులు చేపలు పడితే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు. బోట్లను, వారు పట్టిన చేపలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, జరిమానా కూడా విధిస్తుందని తెలిపారు. దాంతోపాటే, వారికి ప్రభుత్వం అందించే రాయితీలు, సదుపాయాలు నిలిచిపోతాయని వివరించారు.