APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మొత్తం సీట్లు అందుబాటులోకి, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పూర్తి సామర్థ్యం మేర సీట్లు కేటాయించాలని అధికారులు నిర్ణయం
APSRTC Buses. (Photo Credit: PTI)

Amaravati, September 23: ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో (APSRTC) ఇకపై భౌతిక దూరం ఉండదు. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై సీట్ల పూర్తి సామర్థ్యం మేర ప్రయాణికులను అనుమతించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మే 21 నుంచి ఆర్టీసీ సర్వీసులు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే కొవిడ్ నిబంధనల దృష్ట్యా బస్సుల్లో సగం సీట్లకే అందుబాటులో ఉండేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు.

కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తి సామర్థ్యం మేర సీట్లు కేటాయించాలని (Full Capacity With No Standees) అధికారులు నిర్ణయించారు. దీంతో అన్ని సీట్లు అందుబాటులోకి వచ్చేలా ఆన్‌లైన్‌లో మార్పులు చేయనున్నారు.

కరోనా, లాక్‌డౌన్ కారణంగా మార్చి నెలాఖరు నుంచి మే 21 వరకు బస్సుల్ని అనుమతించలేదు. తిరిగి మే 21న ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. అయితే సిటీ బస్సు సర్వీసుల్ని మాత్రం పునరుద్ధరించలేదు. కానీ సెప్టెంబర్ 19 నుంచి విజయవాడ, విశాఖపట్నంలలో సిటీ సర్వీసుల్ని ప్రారంభించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని చోట్ల సర్వీసులు ప్రారంభమయ్యాయి. మిగిలిన పట్టణాలు, నగరాల్లో కూడా సర్వీసులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ మాస్క్‌లు, శానిటైజర్ వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వైఎస్సార్‌ జలకళ.. ఉచిత బోరుకు రైతులు అప్లయి చేసుకోవడం ఎలా? సెప్టెంబర్ 28న వైఎస్ఆర్ జలకళను ప్రారంభించనున్న ఏపీ సీఎం వైయస్ జగన్, ఆ రోజు నుంచే దరఖాస్తులు స్వీకరణ

ఇక తెలంగాణలో కరోనా కట్టడి క్రమంలో గత 6 నెలలుగా డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు కొన్ని బుధవారం ఉదయం రోడ్డెక్కాయి. హైదరాబాద్ శివారులో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయని ఆర్టీసీ గ్రేటర్ ఈడీ తెలిపారు . రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, బండ్లగూడ శివారు ఆర్టీసీ డిపోల్లో బస్సు సర్వీసులు రోడ్డెక్కాయన్నారు. శివారులోని ప్రతి డిపో నుంచి 12 బస్సులను నడుపుతున్నామని.. త్వరలోనే సిటీలోనూ బస్సులు నడిపే అవకాశం ఉందన్నారు. 230 ఆర్టీసీ బస్సులను 135 రూట్లలో తిప్పుతున్నట్లు తెలిపారు. సిటీ సబర్బన్ ఏరియాకు 15 కి.మీ. దూరంలో బస్సులను తిప్పుతున్నట్లు చెప్పారు. గ్రామాల్లోని ప్రయాణికుల రిక్వెస్ట్ మేరకు ఇటీవల జరిగిన ఆర్టీసీ మీటింగ్ లో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు అధికారులు.