YSR Jala Kala: వైఎస్సార్‌ జలకళ.. ఉచిత బోరుకు రైతులు అప్లయి చేసుకోవడం ఎలా? సెప్టెంబర్ 28న వైఎస్ఆర్ జలకళను ప్రారంభించనున్న ఏపీ సీఎం వైయస్ జగన్, ఆ రోజు నుంచే దరఖాస్తులు స్వీకరణ
Jagananna Vasathi Deevena and Jagananna Vidya Deevena Scheme 2020 in AP (Photo-Twitter)

Amaravati, Sep 23: పరిపాలన కొత్త శకానికి నాంది పలుకుతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు చేరువయ్యేందుకు మరిన్ని పథకాల అమలు చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మరో పథకం ఈ నెల 28వ తేదీన ప్రారంభం కానుంది. సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా ( Free borewells) బోర్లు తవ్వించే ‘వైఎస్సార్‌ జలకళ’ (YSR Jala Kala) పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP Cm Jagan) సెప్టెంబర్ 28న లాంఛనంగా ప్రారంభిస్తారు.

వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1.98 లక్షల మంది పేద రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ప్రభుత్వం (AP Govt) పనిచేస్తోంది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వేర్వేరుగా ఎంపిక చేసిన బోర్‌ రిగ్‌ వాహనాలను సీఎం 28వ తేదీన జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ పథకానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ను కూడా సీఎం అదే రోజు ప్రారంభిస్తారు. ఆన్‌లైన్‌ విధానంతో పాటు ఎంపీడీవోల (MPDO) ద్వారా నేరుగా దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ కూడా కొనసాగుతుందని గ్రామీణాభివృద్ధి శాఖ వాటర్‌షెడ్‌ విభాగపు డైరెక్టర్‌ వెంకటరెడ్డి తెలిపారు.

పోలవరం పర్యటనకు రావాలి, కేంద్ర జలశక్తి మంత్రిని కోరిన ఏపీ సీఎం వైయస్ జగన్, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వాలని వినతి

వైఎస్ఆర్ జలకళకు ఈ క్రమంలో అర్హులైన రైతులందరూ గ్రామ సచివాలయాల్లో గాని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సమాచార కమిషనర్‌ విజయ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో పేద రైతులకు ఉచితంగా బోర్లు తవ్విస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేరుస్తూ ‘వైఎస్సార్‌ జలకళ’ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

ఇందులో భాగంగా హైడ్రలాజికల్‌, జియోఫిజికల్‌ సర్వేల ఆధారంగా ఆయా ప్రదేశాల్లో బోర్ల తవ్వకం చేపడతారని కమిషనర్‌ విజయ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా సాగుతుందని స్పష్టం చేశారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అర్హులైన రైతులను ఎంపిక చేస్తామని, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని, వివరాలను ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌ ద్వారా వారికి తెలియజేస్తామన్నారు.

ఏపీలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు, శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన కేంద్ర ప్రభుత్వం

అలాగే బోర్లు తవ్వే పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తామని, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసిన తర్వాతే చెల్లింపులు జరుపుతామని విజయ్‌కుమార్‌రెడ్డి తేల్చి చెప్పారు. సెప్టెంబర్ 28న సీఎం జగన్‌ సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఆ రోజు నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుందని విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

పథకం ప్రారంభమయ్యాక తమకు బోర్ కావాలనుకునే రైతులు ప్రత్యేక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్‌ని కూడా 28నే సీఎం జగన్ ప్రారంభిస్తారు. దరఖాస్తును పరిశీలించి భూగర్భ అధికారులు రైతు పొలం దగ్గరకు వెళ్ళి భూ గర్భంలో ఎక్కడ నీరు ఎక్కువ ఉందో టెక్నికల్ పరికరాల ద్వారా గమనిస్తారు. ఆ తర్వాత... అక్కడ బోర్ వేస్తే... రైతుకి పొలానికి కావాల్సినంత జలం వస్తుందా, అందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా అన్నది గమనిస్తారు. అంతా సెట్ చేసుకున్నాక... రైతును ఓసారి అడుగుతారు. రైతు సరే అనగానే... బోర్ రిగ్ వాహనం వచ్చేస్తుంది. అక్కడ పెద్ద ఎత్తున బోర్ తవ్వేస్తుంది.

బోర్ తవ్వేందుకు టైమ్ పడుతుంది. అప్లై చేసుకున్న చిన్న సన్న రైతులందరికీ ఈ పథకం ప్రయోజనం తప్పక లభించాలనీ, అందుకు పూర్తి వాతావరణం కల్పించాలని సీఎం జగన్... అధికారులను, జిల్లా యంత్రాంగాల్నీ ఆదేశించారు. బోర్ కోసం అప్లై చేసుకునే రైతులు... ఆన్‌లైన్‌ వెబ్‌సైట్ విధానం లేకపోతే... MPDOల ద్వారా నేరుగా దరఖాస్తులు ఇవ్వొచ్చు. ఈ ప్రక్రియ కూడా కొనసాగుతుందని గ్రామీణాభివృద్ధి శాఖ వాటర్‌షెడ్‌ విభాగపు డైరెక్టర్‌ వెంకటరెడ్డి తెలిపారు. అందువల్ల తమకు వెబ్‌సైట్ ఓపెన్ చెయ్యడం తెలియదనుకునే రైతులు... MPDOలను కలిసి సమస్య చెప్పుకోవచ్చు. ఎక్కడా ఎవరికీ రూపాయి లంచం ఇవ్వకుండానే ఈ పని పూర్తి కావాల్సి ఉంటుంది. అందువల్ల ఎవరైనా అధికారులు లంచం అడిగితే... రైతులు కంప్లైంట్ ఇవ్వొచ్చని అధికారులు తెలిపారు.