ఏపీలో అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ఈనెల 14 నుంచి (AP Budget Session 2023) ప్రారంభకానున్నాయి. ఈమేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు.మార్చి 14న ఉదయం 10 గంటల నుంచి ఉభయసభలు (Andhra Pradesh Assembly Budget Session) ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి సంబంధించి ఉభయ సభలనూ ఉద్దేశించి 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.
ఇక ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు.సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో మ.12 గంటలకు ఈ భేటీ ఉంటుంది. బడ్జెట్ సమావేశాలు పురస్కరించుకుని అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశముంది.
ముఖ్యంగా మూడు రాజధానుల అంశం, విశాఖ నుంచి పరిపాలన ఎప్పుడు ప్రారంభించాలనే విషయాలపై కేబినెట్ భేటీలో స్పష్టత ఉండే అవకాశం ఉంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయంపై ప్రకటన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ కీలకంగా మారనున్నాయి. మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో ఈ నెల 28న విచారణ జరగనుంది. విచారణలో కోర్టు తీర్పు కనుక అనుకూలంగా వస్తే మరోసారి మూడు రాజధానుల బిల్లులను ఈ సమావేశాల్లో పెట్టే అవకాశం ఉంది.