Balineni Srinivas Reddy Meets CM Jagan: సీఎం జగన్‌తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ ముగిసింది. గురువారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో సమావేశమైన బాలినేని .. జిల్లాలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను ఎప్పుడూ పార్టీపై అలగలేదని, పార్టీలోని కొందరు ఇబ్బందులు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాను పార్టీ అధినేతను ఎప్పుడూ కలుస్తూనే ఉంటానని చెప్పారు. నియోజకవర్గంపై దృష్టి సారించాలని సీఎం తనకు సూచించినట్లు చెప్పారు. తాను అన్ని అంశాలపై జగన్ తో చర్చించానని, జిల్లాలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకు వెళ్లానన్నారు.
ప్రోటోకాల్ పెద్ద విషయం కాదని, దానిపై ఫిర్యాదు చేయడానికి ఏముంటుందని వ్యాఖ్యానించారు. కొత్తగా రీజినల్ కోఆర్డినేటర్ పదవిపై చర్చ జరగలేదన్నారు. గతంలోనే తాను ఈ పదవికి రాజీనామా చేశానని, మంత్రి పదవిని వదులుకొని ప్రోటోకాల్‌పై ఫీల్ అయ్యేది ఏముంటుందన్నారు. తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. నా నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాటు జరుగుతున్నాయి. సీఎం జగన్‌తో భేటీ వల్ల సంతృప్తిగానే ఉన్నాను’’ అని బాలినేని వివరించారు.