Amaravati, Nov 1: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను (Andhra Pradesh celebrates Formation Day) ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలుగుతల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములకు సీఎం జగన్ నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం, పేదలకు అనుకూలమైన చర్యలను ప్రారంభించడం ద్వారా అభివృద్ధి పథంలో భారీ పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు.
అభివృద్ధి ఫలాలు సమాజంలోని చివరి మనిషికి అందేలా చూడాలనే లక్ష్యంతో ప్రజాకేంద్రీకృత విధానాన్ని కొనసాగించాలన్నారు. ఏ ప్రభుత్వమైనా విజయం సాధించాలంటే ప్రజల సంతోషమే బారోమీటర్ అని అన్నారు. సామాన్యుల కలలు సాకారం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలు మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నానని గవర్నర్ తెలిపారు.