Amaravati, Oct 18: గత కొన్నిరోజులుగా ఏపీ రాజకీయాలు వాడీవేడిగా మారాయి. విశాఖలో వైసీపీ గర్జన, అదే రోజున పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎంట్రీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేయగా, పోలీసుల ఆంక్షలతో జనవాణి కార్యక్రమం నిర్వహించకుండానే పవన్ విశాఖ నుంచి వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు నేడు విజయవాడలో పవన్ కల్యాణ్ ను (Chandrababu Meets Pawan) కలిశారు.
నగరంలోని నోవోటెల్ హోటల్ కు వచ్చిన చంద్రబాబును (Chandra Babu) పవన్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఇరువురు సమావేశమై విశాఖలో జరిగిన పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు జనసేనానికి సంఘీభావం తెలిపారు. కాగా, ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కమిటీ సభ్యుడు నాగబాబు కూడా పాల్గొన్నారు. 2019 ఎన్నికల తర్వాత వారు కలవడం ఇదే తొలిసారి.
ఇవాళ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా బీజేపీపై పొత్తుపై కూడా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి ఇక దూరంగా ఉంటానన్న సంకేతాలు ఇచ్చారు.ఇదే సమయంలో ఆయన చంద్రబాబు నాయుడితో చర్చించడంతో టీడీపీ-జనసేన మళ్లీ కలుస్తాయన్న ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకుండా పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయన్న ఊహాగానాలు వస్తున్నాయి.