Vjy, Dec 18: ఏపీలో ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంను (Aarogyasri Scheme Upgraded) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య చికిత్స కోసం రాష్ట్రంలోని ఏ పేదవాడూ అప్పులపాలయ్యే పరిస్థితి ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ (Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) పేర్కొన్నారు. పేదలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.
ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ సోమవారం కలెక్టర్లు, ఆరోగ్యశాఖ అధికారులతో వర్చువల్ గా భేటీ అయ్యారు. సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీఎంవోలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినితో పాటు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఖరీదైన వైద్యం అందిస్తున్నాం.వైద్యం కోసం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుందని తెలిపారు. పేదలకు మరింత అండగా నిలవాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ కార్డు పరిమితిని రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొత్తగా మరింత మందికి జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష కొత్త కార్డులను (upgraded Aarogyasri scheme) ముఖ్యమంత్రి జారీ చేశారు. ఈ కార్డులో లబ్దిదారుడి ఫొటోతో పాటు ఇతర వివరాలను పొందుపరిచి క్యూ ఆర్ కోడ్ తో రూపొందించినట్లు సీఎం చెప్పారు. పేదలకు ఉచిత వైద్యం అందించే క్రమంలో రాష్ట్రంలోని 2,513 ఆసుపత్రులతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ఆసుపత్రులను కూడా ఎంప్యానెల్ చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ వివరించారు.
తెలంగాణలోని హైదరాబాద్ లో ఉన్న పలు పెద్దాసుపత్రులను కూడా ఎంప్యానెల్ చేశామని వివరించారు. స్పెషాలిటీ సేవలను పేదలకు చేరువ చేయడమే దీనివెనకున్న ఉద్దేశమని తెలిపారు. క్యాన్సర్ వంటి భయానక రోగాల బారినపడిన పేదవారికి గత ప్రభుత్వం రూ.5 లక్షలకు మించి ఇవ్వలేదని సీఎం గుర్తుచేశారు. ప్రస్తుతం క్యాన్సర్ బాధితుల చికిత్సకు ఎంతైనా సరే ప్రభుత్వమే చెల్లిస్తోందని వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కోసం ఏటా రూ.4100 కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు.
రాష్ట్రంలోని 4 కోట్ల 25 లక్షల మంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారని తెలిపారు. పేదవాడికి ఖరీదైన వైద్యం అందుబాటులోకి తేవడంతో పాటు చికిత్స తర్వాత రెస్ట్ తీసుకునే సమయంలోనూ ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోందన్నారు. వైద్యులు సూచించిన విశ్రాంతి కాలానికి ఆరోగ్య ఆసరా కింద నెలకు రూ. 5 వేల చొప్పున లెక్కగట్టి పేదవాడి చేతిలో పెడుతున్నట్లు వివరించారు. ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లే సమయంలోనే ఈ మొత్తం అందిస్తున్నట్లు తెలిపారు.