Vjy, August 11: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లి పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా నాలుగో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు మహిళల ఖాతాల్లో వడ్డీ డబ్బులను బటన్ నొక్కి నేరుగా నగదు జమ చేశారు.
అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈరోజు మంచి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ నాలుగున్నరేళ్లలో మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేస్తున్నాం. అక్కచెల్లెమ్మల సాధికారత కోసం అడుగులు వేశామన్నారు.
పేదింటి అక్కచెల్లెమ్మల మీద వడ్డీభారం పడకూడదు. మహిళల జోవనోపాధి మెరుగుపడేలా బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని 1,05,13,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ చేస్తున్నాం. అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు వేశామన్నారు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు.
దేశ చరిత్రలోనే ఇలాంటి పథకం మరెక్కడా లేదు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం తీసుకొచ్చాం. పేద పిల్లల చదువులకు అయ్యే ఖర్చు పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేశాం. పేదరికం నుంచి బయటపడాలంటే చదువే ఆయుధం. వైఎస్సార్ చేయూత ద్వారం 14వేల 129 కోట్లు అందిచామన్నారు. వసతి దీవెన కింద ప్రతీ ఏటా రూ.20వేలు ఇస్తున్నాం. పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. ఈ స్థాయిలో గతంలో ఇళ్ల పట్టాలు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా 22 లక్షల ఇళ్లు కూడా కట్టిస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా మహిళలకు ఇంతటి మేలు చేయలేదు.
దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. సూర్యోదయం కంటే ముందే వలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్లు అందిస్తున్నారు. నాలుగేళ్ల కాలంలో 2లక్షల 31వేల 123 కోట్లు ఇచ్చాం. బాలింతల కోసం 2వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. బాలింతల కోసం గత ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.400 కోట్లే. ఇది మన ప్రభుత్వం సృష్టించిన చరిత్ర అని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పదవులు మహిళలకే ఇచ్చాం. దిశ పోలీసు స్టేషన్లు, దిశ యాప్‌ను తీసుకువచ్చాం. కోటి 24లక్షల మంది దిశ యాప్‌లో రిజిస్టర్ అయ్యారు. దిశ యాప్ ద్వారా మహిళలకు పూర్తి రక్షణ కల్పిస్తున్నాం. ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వచ్చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు.
ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చిన సీఎం జగన్
ఈ పర్యటనలో మరోసారి ప్రతిపక్షాలపై సీఎం జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు పొలిటికల్ కౌంటరిచ్చారు. రాష్ట్రంలో మహిళలను మోసం చేసిన ఘన చరిత్ర చంద్రబాబుదే.. నారా వారిదేనని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదు. ప్రతిపక్షాల మైండ్‌లో ఫ్యూజులు కూడా ఎగిరిపోయాయని అన్నారు.
2014-19 మధ్య డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రుణాలు మాఫీ చేయకుండా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు నడిరోడ్డు మీద నిలబెట్టారు. బాబు హయాంలో 14వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం చెల్లించామన్నారు. మహిళలను మోసం చేసిన చరిత్ర నారా వారిదే అని స్పష్టం చేశారు. అది వారి చరిత్ర.. అది నారా వారి చరిత్ర.. అది నారీ వ్యతిరేక చరిత్ర అని విమర్శించారు. చంద్రబాబు అరాచకాలను తలుచుకుంటే బాధనిపిస్తుంది. 2016లో సున్నావడ్డీ పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారు. చంద్రబాబు చేసిన మోసానికి ఏ, బీ గ్రేడ్ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌కు దిగజారాయి.
ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదు. ప్రతిపక్షాల మైండ్‌లో ఫ్యూజులు కూడా ఎగిరిపోయాయి. ఇన్నిన్ని పథకాలు చంద్రబాబు హయాంలో చూశారా?. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం ఉందా?. మీ బిడ్డల భవిష్యత్ గురించి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా?. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువుల్ని అడ్డుకున్నారు. 75ఏళ్ల చంద్రబాబు ఇళ్లు కట్టించే ప్రయత్నం చేశారా?. పేదలకు ఇళ్లు ఇస్తుంటే అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా?. ఇలాంటి చంద్రబాబును ఎందుకు సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి. చంద్రబాబు కోసం దత్తపుత్రుడు పరుగులు పెడుతున్నారు.
చంద్రబాబు వంటి వ్యక్తి సీఎం అయితే మనకు మంచి జరగదు. చంద్రబాబు తనకు గిట్టని వారి అంతు చూస్తాడట. ఇందు కోసమే చంద్రబాబు అధికారం ఇవ్వాలట. చంద్రబాబు దళితులను చీల్చి వారికి నరకం చూపించాడు. మైనార్టీల ఓటు బ్యాంకు కోసం వారికి నరకం చూపిస్తున్నాడు. ఎస్టీలకు చంద్రబాబు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదు. బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు చెదిరించాడు. చంద్రబాబు మాటంటే విలువ లేదు, విశ్వసనీయత లేదు. వీరికి కావాల్సింది.. దోచుకోవడం.. పంచుకోవడం.
మొన్నటి పుంగనూరు ఘటన చేస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకు ఇలాంటి రాక్షసులకు సెక్యూరిటీ ఇవ్వాలి. ఒక రూట్‌లో పర్మిషన్ తీసుకుని ఇంకో రూట్‌లో వెళ్లాడు. 47 మంది పోలీసులకు గాయాలు చేశాడు. చంద్రబాబు అరాచకంతో ఒక పోలీసు కన్ను పోగొట్టాడు. శవ రాజకీయాలకు సైతం చంద్రబాబు వెనుకాడటం లేదు. రాబోయే రోజుల్లో నీచ రాజకీయాలు ఎక్కువ చేస్తారు. మీ బిడ్డకు మీరే ధైర్యం. మీకు మేలు జరిగితే మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలబడండి అని అన్నారు.