Amaravati, Dec 26: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం సీఎం ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని (PM Modi) దృష్టికి తీసుకెళ్లనున్నారు. కాగా, ఈ నెల మొదటివారంలో కూడా సీఎం జగన్ (CM Jagan Mohan Reddy) ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీ అధ్యక్షతన జీ20 సదస్సుకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల ప్రధానితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
దీంతో పాటుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నర్సీపట్నం పర్యటన ఖరారైంది. ఆయన ఈ నెల 28వ తేదీన నర్సీపట్నం రానున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి, ఏలేరు–తాండవ అనుసంధాన పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఈమేరకు జిల్లా అధికార యంత్రాంగానికి వర్తమానం అందింది. ఆరోజు ఉదయం 10.20 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు విమానంలో చేరుకొని 10.25 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరతారు.
అల్పపీడన ప్రభావం.. నేడు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు.. ఉత్తర భారతాన్ని వణికిస్తున్న చలి
నర్సీపట్నం మండలం బలిఘట్టం గ్రామానికి 10.40 గంటలకు చేరుకొని.. 10.55 గంటల వరకు ప్రజాప్రతినిధుల్ని సీఎం కలవనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11.15 గంటలకు నర్సీపట్నం మండలం జోగునాథునిపాలెం చేరుకుంటారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఏలూరు–తాండవ అనుసంధాన పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 12.50 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 15 నిమిషాలపాటు స్థానిక నేతలతో ముచ్చటిస్తారు. 1.25 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి తిరిగి విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.50 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు విమానంలో తిరుగు పయనమవుతారు.