Vjy, Nov 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ రైతు భరోసా 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో విడత పెట్టుబడి సాయం పంపిణీకి రంగం సిద్ధమైంది. నేడు శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నారు. ఈ ఏడాది తొలి విడతలో రూ.7,500 చొప్పున 52.57 లక్షల మందికి రూ.3,942.95 కోట్ల మేర ఇప్పటికే పెట్టుబడి సాయాన్ని అందించగా తాజాగా రెండో విడతగా రూ.4 వేల చొప్పున 53.53 లక్షల మందికి రూ.2,204.77 కోట్ల లబ్ధి చేకూర్చనున్నారు.
వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఇచ్చిన మాట కంటే మిన్నగా అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. వెబ్‌ల్యాండ్ ఆధారంగా అర్హులైన భూ యజమానులతోపాటు దేవదాయ, అటవీ(ఆర్‌వోఎఫ్‌ఆర్) భూములను సాగు చేసేవారే కాకుండా సెంటు భూమి కూడా లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు కూడా తొలివిడతగా మే నెలలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడో విడతగా జనవరిలో రూ.2 వేలు చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు.
2019–20లో 46,69,375 మందికి రూ.6,173 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందచేసింది. 2020–21లో 51,59,045 మందికి రూ.6,928 కోట్లు మేర లబ్ధి చేకూర్చగా 2021–22లో 52,38,517 మందికి రూ.7,016.59 కోట్ల సాయాన్ని పంపిణీ చేసింది. 2022–23లో 51,40,943 మందికి రూ.6,944.50 కోట్ల పెట్టుబడి సాయాన్ని నేరుగా ఖాతాలకు జమ చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడతలో 52,57,263 మంది అర్హత పొందారు. వీరిలో 50,19,187 మంది భూ యజమానులు కాగా 1,46,324 మంది కౌలుదారులు, 91,752 మంది అటవీ భూ సాగుదారులున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున తొలి విడతగా జూన్ 1వ తేదీన భూ యజమానులకు, సెప్టెంబర్ 1న కౌలుదారులు, అటవీ సాగుదారులకు రూ.3,942.95 కోట్ల మేర సాయాన్ని అందించారు. రెండో విడతలో 53,52,905 మంది అర్హత పొందారు.
వీరిలో భూ యజమానులు 51,00,065 మంది కాగా 1,59,674 మంది కౌలుదారులు, 93,168 మంది అటవీ భూ సాగుదారులు ఉన్నారు. తొలి విడతతో పోల్చుకుంటే 80,878 మంది భూ యజమానులు, 13,350 మంది కౌలుదారులు, 1416 మంది అటవీ భూ సాగుదారులు కలిపి మొత్తం 95,642 మంది కొత్తగా అర్హత పొందారు. వీరికి తొలి విడత సాయంతో కలిపి రూ.11,500 జమ చేయనున్నారు.
అర్హత పొందిన 53.53 లక్షల మంది రైతు కుటుంబాలకు 7వ తేదీన రెండో విడతగా రూ.2,204.77 కోట్ల సాయాన్ని అందించనున్నారు. ఈ మొత్తంతో కలిపితే ఈ ఏడాది రూ.6,147.72 కోట్ల సాయాన్ని అందుకున్నట్లవుతుంది. తాజాగా జమ చేయనున్న రెండో విడత సాయంతో కలిపితే గత నాలుగున్నరేళ్లలో సగటున 53.53 లక్షల మందికి వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందచేసినట్లవుతుంది.